Sunday, April 27, 2008

ప్రేయసి (ఖండ కావ్యం - రెండవ భాగం)

అంతట ఆమె నా ఎదుట నుండి కదలి పోయినది.

ఆ.వె. కదలిపోయె గాని వదన శశాంకము
వదల లేదు నాదు మదిని తాను
ఎదుట లేదు గాని ఎదను విడిచి లేదు
హృదయ మధ్యమంబు సదనమాయె!!

ఆ.వె. దూరమాయె గాని వర మనోహర మూర్తి
విరి శరముల బాధ తీర లేదు
దరిని లేదు గాని దరహాస వదనంబు
మరుని కరుణ కలుగు దారి లేదు!!

ఇక ఆ నాటినుండి నా లోచనాలకు తన రూపమే కాన వచ్చు. నా అలోచనల నిండా తన ధ్యాసే నిండియుండు.

ఆ.వె. కునుకు చేరదాయె తన తలపుల తోడ
ఊహలన్ని లోన దేహమామె
కనుల ముందు లేదు కమనీయ రూపము
కలలు వీడి పోదు నెలత మోము!!

ఆ.వె. మరపు రాక పోయె మరుని యింతిని పోలి
వలపు పుట్టసాగె నిలుప తరమె
అలవి కాని మనసు, వల్లకాకుండెను

తలపులన్ని నిలిచె నెలత పైన!!

ఆ.వె. మరల మరల మగువ మానసంబుకు వచ్చు
తలచి తలచి నాకు వలపు హెచ్చు
తాల లేక యున్న తనను కనుట లేక
వేళ కాని వేళ వేగిరమున!!

ఇక అన్ని వేళలా నా మానసంబు నిండా ఆమె తలపులే..

తే. నిదుర పోయెడి వేళ ఆ నెలత తలపె
మధ్య నిద్ర మేల్కాంచి ఆ మగువ తలపె
సుప్రభాతపు వేళ ఆ సుదతి తలపె
దంత ధావన వెళ ఆ యింతి తలపె!!

తే. స్నానమాడెడి వేళ ఆ జాని తలపె
వస్త్ర ధారణ వేళ ఆ వనిత తలపె
ఆరగించెడి వేళ ఆ అతివ తలపె
బయటకు వెడలు వేళ ఆ పడతి తలపె!!

తే. పనుల వేళలో పలుమార్లు మనసు చేరు
నిలువనీయదు చిత్తము నిమిషమైన
వల్ల కాకనుండెను నాకు వలపు తోడ
నుల్లమందున నిలిచెను పుల్ల నేత్రి!!

ఇంతకూ ఆమె ఎవరో.. ఎక్కడుండునో తెలియకుండెనుగదా.....

కం. ఎచ్చోటనుండునేమో
నచ్చిన చిన్నది ప్రియముగ మాటలాడన్..
నెచ్చెలి నెప్పుడు చూచెద?
చెచ్చర చూడగ చికీర్ష చిత్తము కలిగెన్!!

కం. విరజాజి విరుల రీతిన్
దరహాస సుమము విరిసిన, తన్మయమొందన్
దరి చేరి పలకరింపగ
సరియగు దారిని తెలియక సతమతమగుచున్...

కాని ఆలోచించి చూసిన, నాలో మునుపెన్నడిట్టి భావావేశము కలుగ లేదు. నేడు కలుగుటకు కారణంబేమి?

తే. మునుపు సుందర మూర్తుల కనులగంటి
నెన్నడిట్టి భావంబులు నెఱుగ లేదు
తా వలచినది రంభయు, తా మునిగిన
గంగ యందురు నిక్కము కాక పోదె!!

(సశేషం)
- సత్య
=============================




Saturday, April 19, 2008

ప్రేయసి (ఖండ కావ్యం - మొదటి భాగం)

అది ఒక సూర్యోదయ వేళ. బాల భాస్కరుడు తన లేలేత కిరణాలు ప్రసరిస్తున్న వేళ.మంచు పొరలు కరిగిపోతున్న సమయం.

ఉ. కాటుక చీకటుల్ తొలగి కాంతులు చిమ్ముచు కర్మ సాక్షి బా
హాటమునయ్యె, సిగ్గుగల హల్లక నేత్రికి మెల్లమెల్లగా
కూటమి వేళలన్ వదులు కోమలి సిగ్గుల రీతినంతటన్
తేటములాయె మంచు పొర తీవ్రత వృద్దికి సూర్యరశ్మికిన్!!

అట్టి సమయాన నేను ఉదయ వ్యాహ్యాళికి బయలుదేరినొక సుందరాంగిని చూచితిని..

సీ. చూచితి సురకన్య చూపుల పడతిని
కాంచితి కమనీయ కాంత రూపు
కనుగొంటి కమలారి ఆనన బింబము
కంటిని మీనముల్ కళ్ల లోన
దృష్టి నిల్పితి తన దివ్య లాస్యముపైన
నేత్ర పర్వంబాయె నెలత చూడ
పోల్చితి రూపున లచ్చికి సరియని
ఎఱిగితి పిమ్మట మరుని శరము

తే. విరుల గుబురులు వికసించి మరలి చూచు
శాంతి మూర్తీభవించిన యింతి, కుంద
రదన, సుందర సుకుమార వదన, సంప్ర
దాయమునకు నిలయమైన తరుణి తాను!!

ఆ అందాల కన్యను చూచినంతనే నా డెందంబునూగిసలాడి ఆనంద పరవశమయినది..

తే. కన్ను దోయికి కలిగెను మిన్నునంటు
సంబరంబు తనను చూడ చలనమొంది
తేజమొందెను వదనంబు తీరు మారి
హృదయమున నిజమైనట్టి యుదయమాయె!!

ఏమని వర్ణించను ఆ సుందర రూపాన్ని,ఏమని వర్ణించను ఆ మధురిమలొలుకు పలుకులను ...

ఆ.వె. సురల లోన సిరికి సరియగు తరళము
కీరవాణి కరణి తరుణి పలుకు
వరుల హృదయ ఝరులు మురిపాల కలియును
విరులు నిండు కురులు మరులు గొల్పు!!


ఆ ముగ్ద మనోహర మూర్తి అధరముల గురించి ఏమని చెప్పగలను...

కం. వలపుల కేళిన కలహపు
మొలకలు పొసమిన చిలకలు ముక్కులు మీటన్
నెలత పెదవులన్ మీటెను
చిలకలు కొన్ని బ్రమతోడ చిత్రపు రీతిన్!!


ఆ సౌందర్యమును చూచినంతనే నా మది నా అదుపు తప్పి పరి పరి విథాల చెదిరినది....

సీ. మేఘాల కౌగిలి మేలిమి ముసుగులు
తొలగిన చంద్రిక తోచె మదికి
అనురాగ మేఘాల జనితమయ్యెడి స్పుర
ద్విద్యుల్లత కరణి విశదమయ్యె
చల్లని వేళలనల్లన విరిసెడి
మొల్ల పువ్వుల రీతి తెల్లమాయె
మధుకర వాంఛిత మంజుల మాధురీ
మకరంద మందిర మాయె మదికి

తే. సర్వ శుభ లక్షణంబులు సరిగ కూర్చి
జేసిన పసిడి ముద్దగ వాసికెక్కు
బ్రహ్మ సృష్టికి మెఱుగులు కుమ్మరించు
చూచు వారు పుణ్యపు నోము నోచువారు!!

అట్టి ఆ పడతి అందచందాలు చూసిన నా మదికి యిటులనిపించె.....

తే. సకల సౌందర్య సంఘమ్ము నకలు కాగ
అసలు తానై నిలచియుండు దిశలనెల్ల
వలచి వచ్చిన చాలిట్టి వనిత నొకతి
వసుధ లోనే సుధారసం వశ్యమగును!!
(సశేషం)

- సత్య

===================================

Sunday, April 13, 2008

పెళ్లి పందిరి సందడి

సందళ్లు సేయరే సారసాక్షులారా
పందిళ్లు వేయరే కార్య దక్షులారా
అరుగులు అలకరే కలికి చిలకల్లరా
చాపలు పరవరే చంచలాక్షులారా
ముందుండి నడిపింపరే ముదిమి ముత్తైదుల్లారా
విందు వంటలు చూడరే విరిబోడుల్లారా
వడ పప్పు సేయరే వారిజాక్ష వనితలారా
పానకాలు కలపరే పడుచు పోరగాల్లారా
సర్వ సిద్దమవ్వరే సాధు పురుషులారా
అయ్యవారిని పిలవరే పరుగు పరుగు తోడ
చిన్నబుచ్చుకోకండి చిన్న విషయము లోన
పెద్దలే అందరూ ఉమ్మడి పండగలోన
పీటలెక్కరే ప్రియ దంపతులారా
సాటివచ్చు దివ్య సీతారాములారా

కుందనాల బొమ్మరో కన్య సీత చూడ
అందాల రాముడే కోరి జతను కూడె
నల్ల రాముని కంట నింపిన
సీత కంటికి కాటుకేలనో
బుగ్గ చుక్క కానవచ్చునే
నల్ల రాముని చెంప పైన
మస్తకము వంచె జానకి సిగ్గు తోడ
పుస్తె కట్టె పురుషోత్తముడు ప్రేమ తోడ
యుగము మారినా జగము మరవని జంట
సగముగా మారు నిగమ సారపు పంట!
-సత్య

Saturday, April 5, 2008

సమస్యా పూరణం: కలువ వికసించె సూర్యుని కరము సోకి

తే. బద్దకస్తుడొక్కండును మిద్దెనెక్కి
నిద్ర పోయె, లేచుటకై ప్రభాత వేళ,
మొద్దు నిద్ర వీడక పెట్టె ముసుగు, కంటి
కలువ వికసించె సూర్యుని కరము సోకి!

- జిగురు సత్యనారాయణ

Thursday, April 3, 2008

సమస్యా పూరణం:హనుమా! లక్ష్మిని పెండ్లియాడుమని యభ్యర్దించే నబ్ధీశుడున్

మ. ఘనమో క్షీర సముద్రమున్ జిలుకు లగ్నంబందు శ్రీదేవి తా
జనియించెన్ జలరాశి యింట, హరి విశ్వాత్ముండు విష్ణుండు యీ
వనితన్ చేకొన తగ్గవాడనుచు, దివ్యన్, సింధుజన్, ఘూక వా
హను, మా లక్ష్మిని పెండ్లి యాడుమని యభ్యర్థించె నబ్థీశుడున్!
- జిగురు సత్యనారాయణ

వివరణ: ఘూకం = గుడ్ల గూబ
ఘూక వాహన = గుడ్ల గూబను వాహనం గా కలిగినది = లక్ష్మీ దేవి

(అ)సమానత

ఒక వైపు.....................
అంబర చుంబిత సౌథంబులు
దివి తుల్య సుఖ భోగమ్ములు
జిహ్వ ప్రియకర రుచిరాన్నముల్
వివిథ శాస్త్ర విశాల విజ్ఞానముల్
చీనాబర ధారణ విభ్రమంబుల్
నియంత్రోష్ణకర యంత్ర జాలముల్
మాలిన్య నిర్మూలిత జల భాడంబుల్
విద్యుత్ దీప భాసిత భవనంబుల్
విహాయసోపమ విస్తార వీధుల్
సంచిత ధన నిక్షిప్త సంస్థల్

మరో వైపు....................
నీట మునుగు తాటాకు గుడిసెల్
నిత్య దరిద్ర భృత్య జనుల్
గంజి నీళ్ల గరీబీ గముల్
అక్షర శిక్షణ దక్షత దూరుల్
చినుగు చీరల మాటున స్త్రీల శీలముల్
ఘోర శీతల కాల భాధితుల్
కల్మశ పూరిత శాపాపస్సుల్
గాఢాంధకార బంధీ గృహముల్
పెక్కు ఇక్కట్ల ఇరుకు సంధుల్
యాచక హస్త రోధన తతుల్

తల్లీ! భారత జనయిత్రీ!
ఎక్కడ భిన్నత్వం లో ఏకత్వం?
ఎక్కడ అసమానతల నడుమ సమానత్వం?
ఎప్పుడు సర్వజనావళి సంతోషమగ్నులయ్యేది?
ఎప్పుడు విశ్వ శాంతి విరులు విరగబూసేది?
వేచి ఉన్నా! వేల కళ్లతో ఎదురు చూస్తున్నా!!
-సత్య

Tuesday, April 1, 2008

సమస్యా పూరణం: మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్

కం.వేసము వేసిన కలుగును
మీసములు పడతికిఁ జూడ, మిధ్యగ మారున్
వేసము తొలగింపంగన్
మీసాలే స్త్రీకి సొబగు ? మీరేమన్నన్!

వివరణ: మీసాలు + ఏ స్త్రీకి సొబగు ? = మీసాలే స్త్రీకి సొబగు ? ( మీసాలు ఏ స్త్రీకి సొబగు కాదు అని భావం)
- జిగురు సత్యనారాయణ