Sunday, September 25, 2011

సమస్యా పూరణ ద్వితీయ శతం - చివరి భాగము


సమస్య 176: ఓనమాలు రాని యొజ్జ మేలు.
నాస్తికుండొకండు నయముగ పల్కెను
"ఓం నమః యనంగ, నూరకేల
వచ్చు విద్యలన్ని
? వలదు మంత్రము మాకు!
ఓనమాలు రాని యొజ్జ మేలు!"
సమస్య 177: మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.
మిగుల తలచె వాణి యిటుల
మగడొసుగును దనుజులకును మహిమల్ వరముల్

జగమును కావగ తెలియడు

మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్!!
సమస్య 178: కలికి కంటినీరు కలిమి నొసఁగు.
గడియ కొకటి వచ్చు కన్నీటి సీరియల్
సాగదీయు శోక సాగరాన్ని

చాల డబ్బు వచ్చు చానలు వానికి

కలికి కంటినీరు కలిమి నొసఁగు!!
సమస్య 179: అల్పుఁ డెపుడు పల్కు నాదరమున.
అల్పుడెపుడు పలుకు నాడంబరముగను
గొప్ప వారినైన తప్పు బట్టు

సద్గుణాఢ్య వేద సాగర శోధనా

నల్పుఁ డెపుడు పల్కు నాదరమున!!

శోధన + అనల్పుఁడు = శోధనానల్పుఁడు
సమస్య 180: కేశవుఁడు సచ్చెఁ గౌరవుల్ ఖిన్నులైరి
ముసలము జనించె ముని శాపము వలన, యదు
కులము నాశనమొందెను కలహమందు

బొటన వ్రేలికి తగిలెను బోయ తూపు
కేశవుఁడు సచ్చెఁ గౌరవుల్ ఖిన్నులైరి!!
(కౌరవుల్ = కురు వంశమున జనించిన వారు)
సమస్య 181: పొర్లుదండాలతో రాచపుండు మానె
ఫోరు ట్వంటీలతో నిండె పొలిటికల్సు
తూచ లేనట్టి అవినీతి రాచ పుండు

కోర్టు మెట్లపై పొర్లించి కుట్రలరయ

పొర్లుదండాలతో రాచపుండు మానె!!
సమస్య 182: పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్.
పన్నగ భూషణుండె తన వాకిటి కావలి కాగ గర్వియై
మన్నన లేని బాణుడు కుమార్తె నెపంబున వైరమూని ఆ

వెన్నల చోరునిన్ తెగిడెఁ పిల్చిన పల్కెడి శూలి అండతో

పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్!!
సమస్య 183: స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్.
బూతులు పలికెడి నేతలు
ప్రేతముల వలె తగులుకొనె ప్రియతమ జాతిన్

నేతల మితి మీరిన వాక్

స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్!!
సమస్య 184: పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్.
ఛత్రమ్మే నాడు ప్రజకు
పత్రిక, నేటికి విలువలు పడిపోయెఁ గదా!
చిత్రముగ నేడు  వార్తా
పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్

వార్తా పత్రము = News Paper
సమస్య 185: గురువు లైన నేమౌను రాకొట్టవచ్చు.
మంచి సోడా కలపవలె మందు నందు
అనుభవము లేని వారల కదియె మేలు

మెల్ల మెల్లగా దేహము ఝల్లుమనును

గురువు లైన నేమౌను "రా" కొట్టవచ్చు!!
సమస్య 186: కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము.
రక రకాల చీరలెదుట రహివహింప
వనితలకొకటి యెన్నగ వల్ల కాదు

మగువలు నిలుపఁ జాలరు మనసు
, పలు
కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము!!
సమస్య 187: పాలు గావలెనని యన్న పట్టుబట్టె.
ఉన్నది మిగుల యిరుకైన చిన్ని కొంప
పైగ చుట్టాలు వచ్చిరి పల్లె నుండి

వల్ల మానిన పని కాగ వదిన
కు, మురి
పాలు గావలెనని యన్న పట్టుబట్టె
!!
సమస్య 188: సౌరభము సుంత లేని పుష్పములె మేలు.
తల్లి తుమ్మెద పలికెను పిల్ల తోడ
"వెళ్ల వలదీవు సంపంగి విరుల కడకు
మత్తు లోన మునిగి నీవు చిత్తవుదువు

సౌరభము సుంత లేని పుష్పములె మేలు"!!
సమస్య 189: వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె.
జల్లు లెక్కువైన తనకు జలుబు సేయు
వెజ్జు రోగిగ మారెను వింత యనుచు

పలుచ దనముఁ జేసి ప్రజలు పల్కుననుచు

వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె!!

వాగు కడ పూరి పాకయె వైద్యశాల
ఏరు పొంగిన లోనికి నీరు వచ్చు

నీరు వచ్చిన వైద్యుడు నిలువ లేడు

వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె!!
సమస్య 190: చేరె నవరసమ్ములలోన నీరసమ్ము.
నవ రసమ్ములను నటించు నటులు పోయె
చెడెను వారసుల్ చేరగ చిత్ర సీమ

వెకిలి చేష్టలే నటనగ పేరు మోయ

చేరె నవరసమ్ములలోన నీరసమ్ము!!
సమస్య 191: ఎద్దును జేరి పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్.

శివాలయములో నంది శృంగముల నడుమనుండి శివుని దర్శించు వేళ:-
శుద్ధిగ నేను శంకరుని శోభనుఁ జూడగ దేవలమ్ముకున్

ప్రొద్దున వెళ్లితిన్
, పరమ రుద్రుని పావన మూర్తిఁ జూడగా
ఎద్దును జేరి
, పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్
ముద్దుగ గ్రద్ద నెద్దులను పూనెడి వారలు వేరు కాదుగా!!
సమస్య 192: చెఱకువిలుకాఁడు చెలికాఁడు శివున కెపుడు.
లగ్గ మొనరింప వచ్చిన సిగ్గు పడక
అగ్గి కన్నుతో తనువును బుగ్గిఁ జేసె

చెఱకువిలుకాఁడు పగవాడు శివున కెపుడు!

చెఱకువిలుకాఁడు చెలికాఁడు శివున కెపుడు?
సమస్య 193: కరుణామయు లన్నవారు కాలాంతకులే.
చిర కాలపు వ్యాధి వలన
మరణముకై చూడ రోగి మంచమునందున్

కరుణన్ జంపగ రోగిని

కరుణామయు లన్నవారు కాలాంతకులే!!

కరుణామయుడను పాత్రను
ధరించి మన్ననలు పొంది తా దోపిడికిన్

సరసకుఁ జేరిన చిత్రమె

కరుణామయు లన్నవారు కాలాంతకులే!!
సమస్య 194: ఓడ నేల పయిన్ నడయాడఁ దొడఁగె.
చూడఁగ "డ"కారమె శివుఁడు, శుభములిడగ
కాశికా పట్టణమ్మున వాశిఁ గాంచె

వీడి వచ్చె కైలాసము
, చూడరె అయ
యో! నేల పయిన్ నడయాడఁ దొడఁగె!!

డ = శివుఁడు
సమస్య 195: దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్.
కోపమ్మట రాహువుకును
తాపమ్మున రవిని మ్రింగు తరుణమ్మిదియే

దీపము వెలిగించుమనగ

దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్!!
సమస్య 196: కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
అదిరి చెమట పుట్టె నర చేతికి, మరియు
సైకిలేమొ బెదిరి సైడుగుండె

కారు కూత తోడ కలహము మొదలని

కారు కంటఁ బడినఁ గంపమెత్తె

ఏరు వాక సాగి యెంత కష్ట పడిన
పంట కోత వేళ వాన రాగ

నీటి పాలగునని నీరసించి
, "మొగులు
కారు" కంటఁ బడినఁ గంపమెత్తె!!
సమస్య 197: అన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్.
గణ్యులవినీతి పథమున
మాన్యములాక్రమణఁ జేసి మాన్యత విడిచెన్!

ధన్యత నొందగ వారల

కన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్!!
సమస్య 198: గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె.
విఘ్నపతి మ్రొక్క గిరిజకు, "వింత యిదియె
గర్భమే రాని గౌరికి కలిగె సుతులు

గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె"

ననుచు మిగుల పరిహసించె నబ్ధి సుతుఁడు!!


అబ్ధి సుతుఁడు = చంద్రుఁడు
సమస్య 199: రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ.
టైటు ప్యాంట్లపై చొక్కాలు టైలు గట్టి
టక్కుఁ జేయ చెమట కారి చిక్కు గలుగు

పంచె లుంగీలఁ బోలెడి వస్త్రముల ధ

రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ!!
సమస్య 200: దోఁచుకొన్నవాఁడె తోడునీడ.
దోచె కట్నమనుచు, దోచె లాంఛనమని,
దోచె పబ్బమనుచు
, దోచె నకట
దాచు కున్నదెల్ల
దశమ గ్రహంబన,
దోఁచుకొన్నవాఁడె తోడునీడ!!