Tuesday, February 3, 2009

మాతృ గీతము (అమ్మ పాట)


మత్త కోకిల:
నొచ్చు చుండెను నిండు చూలము మోయ గర్భము భారమే
హెచ్చుగయ్యెను కాన్పు బాధలు హింసనొందెను దేహమే
పచ్చి కాయము నొప్పి పుట్టెను పట్టు దప్పెను పాపకై
ఇచ్చగించెద మానసంబున యింత కష్టము నోర్పుతో!! 1

మత్త కోకిల:
జోల పాటకు నీవు నిద్దుర జోగుచుండుము హాయిగా
లీల నవ్వుల మోము జూసెద లేత చెక్కిలి మీదుగా
పాల బుగ్గల పైడి ముద్దవు ప్రాణమంతయు నీవెరా
కాలమంతయు నిల్చి పోవును కాంచ నిన్నును ప్రేమతో!! 2

మత్త కోకిల:
ముద్దుగారెడి చిన్ని జాబిలి పుణ్యమంతయు నీవెరా
సద్దు సేయక పొమ్ము నిద్దుర సద్గుణంబుల బాలకా
విద్దెలన్నియి నేర్చి నీవును వెల్గుచుండగ జూచెదా
హద్దు దాటక నిల్చి యుండుచునమ్మ పేరును నిల్పరా!! 3

మత్త కోకిల:
గోల సేయగ వద్దు మీరలు కోపగించెద నమ్మరో
బాలకుండు పరుండె నిప్పుడు పల్కులాడక వెళ్లుమా
కాలి యందెలు మ్రోగ లేచును కాలునూపక నిల్వుమా
ఏల వచ్చిరి మాటలాడక యీడిపించక తెల్పుమా!! 4

మత్త కోకిల:
బక్క చిక్కిన చిన్ని పొట్టకు పాలు త్రాపగ లేవరా
దిక్కులన్నియు చక్కనయ్యను తేరి చూడగ లేవరా
అక్క యన్నల తోడ నాడగ నాలకించగ లేవరా
చుక్క వచ్చెడి వేళ నిద్దుర చొచ్చ వచ్చును లేవరా!! 5

మత్త కోకిల:
మొక్కులెన్నియొ మొక్కుకుంటిని ముందు వాటిని తీర్చెదా
వెక్కసమ్ముగ మమ్ము గావుము విశ్వ బాంధవ సర్వదా
మక్కువెక్కువ ముద్దు బిడ్డడు మమ్ము రక్షణ సేయుమా
దిక్కులన్నిట నక్కియుండెడి దిక్కు నీవెగ దైవమా!! 6

మత్త కోకిల:
గడ్డు కాలము వచ్చి యుండిన గట్టిగుండుము పుత్రకా
ఎడ్డి మాటలు మాటలాడక యింగితమ్మును నేర్వుమా
చెడ్డ దారిని త్రొక్క బోకుము శ్రీలు పొందుచు నుండుమా
ఒడ్డి నిల్వుము ప్రాణ సంపద నూతమవ్వును ధర్మమే!! 7

మత్త కోకిల:
సర్వ శాస్త్రములందు మేటిగ సాధనంబును సేయరా
గర్వమింతయు లేకయుండుము కారు చీకటి చేరకే
నిర్వహింపుము నీదు బాధ్యత నిండు గుండియ తోడుగా
నేర్వకుండుము దుష్ట వర్తన స్నేహమెప్పుడు పుత్రకా!! 8

మత్త కోకిల:
కల్లలాడగ సమ్మతింపను కట్టి కొట్టెద చూడిమీ
అల్లరంతయు మాని బుద్దిగ యాటలాడుము బాలకా
చెల్లబోదిక యెల్ల కాలము చిన్న వాడన పుత్రకా
పిల్ల చేష్టలు వీడి మెల్గుము పెద్ద వాడవు నీవికా!! 9