Sunday, September 25, 2011

సమస్యా పూరణ ద్వితీయ శతం - చివరి భాగము


సమస్య 176: ఓనమాలు రాని యొజ్జ మేలు.
నాస్తికుండొకండు నయముగ పల్కెను
"ఓం నమః యనంగ, నూరకేల
వచ్చు విద్యలన్ని
? వలదు మంత్రము మాకు!
ఓనమాలు రాని యొజ్జ మేలు!"
సమస్య 177: మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.
మిగుల తలచె వాణి యిటుల
మగడొసుగును దనుజులకును మహిమల్ వరముల్

జగమును కావగ తెలియడు

మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్!!
సమస్య 178: కలికి కంటినీరు కలిమి నొసఁగు.
గడియ కొకటి వచ్చు కన్నీటి సీరియల్
సాగదీయు శోక సాగరాన్ని

చాల డబ్బు వచ్చు చానలు వానికి

కలికి కంటినీరు కలిమి నొసఁగు!!
సమస్య 179: అల్పుఁ డెపుడు పల్కు నాదరమున.
అల్పుడెపుడు పలుకు నాడంబరముగను
గొప్ప వారినైన తప్పు బట్టు

సద్గుణాఢ్య వేద సాగర శోధనా

నల్పుఁ డెపుడు పల్కు నాదరమున!!

శోధన + అనల్పుఁడు = శోధనానల్పుఁడు
సమస్య 180: కేశవుఁడు సచ్చెఁ గౌరవుల్ ఖిన్నులైరి
ముసలము జనించె ముని శాపము వలన, యదు
కులము నాశనమొందెను కలహమందు

బొటన వ్రేలికి తగిలెను బోయ తూపు
కేశవుఁడు సచ్చెఁ గౌరవుల్ ఖిన్నులైరి!!
(కౌరవుల్ = కురు వంశమున జనించిన వారు)
సమస్య 181: పొర్లుదండాలతో రాచపుండు మానె
ఫోరు ట్వంటీలతో నిండె పొలిటికల్సు
తూచ లేనట్టి అవినీతి రాచ పుండు

కోర్టు మెట్లపై పొర్లించి కుట్రలరయ

పొర్లుదండాలతో రాచపుండు మానె!!
సమస్య 182: పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్.
పన్నగ భూషణుండె తన వాకిటి కావలి కాగ గర్వియై
మన్నన లేని బాణుడు కుమార్తె నెపంబున వైరమూని ఆ

వెన్నల చోరునిన్ తెగిడెఁ పిల్చిన పల్కెడి శూలి అండతో

పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్!!
సమస్య 183: స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్.
బూతులు పలికెడి నేతలు
ప్రేతముల వలె తగులుకొనె ప్రియతమ జాతిన్

నేతల మితి మీరిన వాక్

స్వాతంత్ర్యము దేశజనుల చావుకు వచ్చెన్!!
సమస్య 184: పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్.
ఛత్రమ్మే నాడు ప్రజకు
పత్రిక, నేటికి విలువలు పడిపోయెఁ గదా!
చిత్రముగ నేడు  వార్తా
పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్

వార్తా పత్రము = News Paper
సమస్య 185: గురువు లైన నేమౌను రాకొట్టవచ్చు.
మంచి సోడా కలపవలె మందు నందు
అనుభవము లేని వారల కదియె మేలు

మెల్ల మెల్లగా దేహము ఝల్లుమనును

గురువు లైన నేమౌను "రా" కొట్టవచ్చు!!
సమస్య 186: కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము.
రక రకాల చీరలెదుట రహివహింప
వనితలకొకటి యెన్నగ వల్ల కాదు

మగువలు నిలుపఁ జాలరు మనసు
, పలు
కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము!!
సమస్య 187: పాలు గావలెనని యన్న పట్టుబట్టె.
ఉన్నది మిగుల యిరుకైన చిన్ని కొంప
పైగ చుట్టాలు వచ్చిరి పల్లె నుండి

వల్ల మానిన పని కాగ వదిన
కు, మురి
పాలు గావలెనని యన్న పట్టుబట్టె
!!
సమస్య 188: సౌరభము సుంత లేని పుష్పములె మేలు.
తల్లి తుమ్మెద పలికెను పిల్ల తోడ
"వెళ్ల వలదీవు సంపంగి విరుల కడకు
మత్తు లోన మునిగి నీవు చిత్తవుదువు

సౌరభము సుంత లేని పుష్పములె మేలు"!!
సమస్య 189: వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె.
జల్లు లెక్కువైన తనకు జలుబు సేయు
వెజ్జు రోగిగ మారెను వింత యనుచు

పలుచ దనముఁ జేసి ప్రజలు పల్కుననుచు

వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె!!

వాగు కడ పూరి పాకయె వైద్యశాల
ఏరు పొంగిన లోనికి నీరు వచ్చు

నీరు వచ్చిన వైద్యుడు నిలువ లేడు

వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె!!
సమస్య 190: చేరె నవరసమ్ములలోన నీరసమ్ము.
నవ రసమ్ములను నటించు నటులు పోయె
చెడెను వారసుల్ చేరగ చిత్ర సీమ

వెకిలి చేష్టలే నటనగ పేరు మోయ

చేరె నవరసమ్ములలోన నీరసమ్ము!!
సమస్య 191: ఎద్దును జేరి పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్.

శివాలయములో నంది శృంగముల నడుమనుండి శివుని దర్శించు వేళ:-
శుద్ధిగ నేను శంకరుని శోభనుఁ జూడగ దేవలమ్ముకున్

ప్రొద్దున వెళ్లితిన్
, పరమ రుద్రుని పావన మూర్తిఁ జూడగా
ఎద్దును జేరి
, పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్
ముద్దుగ గ్రద్ద నెద్దులను పూనెడి వారలు వేరు కాదుగా!!
సమస్య 192: చెఱకువిలుకాఁడు చెలికాఁడు శివున కెపుడు.
లగ్గ మొనరింప వచ్చిన సిగ్గు పడక
అగ్గి కన్నుతో తనువును బుగ్గిఁ జేసె

చెఱకువిలుకాఁడు పగవాడు శివున కెపుడు!

చెఱకువిలుకాఁడు చెలికాఁడు శివున కెపుడు?
సమస్య 193: కరుణామయు లన్నవారు కాలాంతకులే.
చిర కాలపు వ్యాధి వలన
మరణముకై చూడ రోగి మంచమునందున్

కరుణన్ జంపగ రోగిని

కరుణామయు లన్నవారు కాలాంతకులే!!

కరుణామయుడను పాత్రను
ధరించి మన్ననలు పొంది తా దోపిడికిన్

సరసకుఁ జేరిన చిత్రమె

కరుణామయు లన్నవారు కాలాంతకులే!!
సమస్య 194: ఓడ నేల పయిన్ నడయాడఁ దొడఁగె.
చూడఁగ "డ"కారమె శివుఁడు, శుభములిడగ
కాశికా పట్టణమ్మున వాశిఁ గాంచె

వీడి వచ్చె కైలాసము
, చూడరె అయ
యో! నేల పయిన్ నడయాడఁ దొడఁగె!!

డ = శివుఁడు
సమస్య 195: దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్.
కోపమ్మట రాహువుకును
తాపమ్మున రవిని మ్రింగు తరుణమ్మిదియే

దీపము వెలిగించుమనగ

దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్!!
సమస్య 196: కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
అదిరి చెమట పుట్టె నర చేతికి, మరియు
సైకిలేమొ బెదిరి సైడుగుండె

కారు కూత తోడ కలహము మొదలని

కారు కంటఁ బడినఁ గంపమెత్తె

ఏరు వాక సాగి యెంత కష్ట పడిన
పంట కోత వేళ వాన రాగ

నీటి పాలగునని నీరసించి
, "మొగులు
కారు" కంటఁ బడినఁ గంపమెత్తె!!
సమస్య 197: అన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్.
గణ్యులవినీతి పథమున
మాన్యములాక్రమణఁ జేసి మాన్యత విడిచెన్!

ధన్యత నొందగ వారల

కన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్!!
సమస్య 198: గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె.
విఘ్నపతి మ్రొక్క గిరిజకు, "వింత యిదియె
గర్భమే రాని గౌరికి కలిగె సుతులు

గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె"

ననుచు మిగుల పరిహసించె నబ్ధి సుతుఁడు!!


అబ్ధి సుతుఁడు = చంద్రుఁడు
సమస్య 199: రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ.
టైటు ప్యాంట్లపై చొక్కాలు టైలు గట్టి
టక్కుఁ జేయ చెమట కారి చిక్కు గలుగు

పంచె లుంగీలఁ బోలెడి వస్త్రముల ధ

రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ!!
సమస్య 200: దోఁచుకొన్నవాఁడె తోడునీడ.
దోచె కట్నమనుచు, దోచె లాంఛనమని,
దోచె పబ్బమనుచు
, దోచె నకట
దాచు కున్నదెల్ల
దశమ గ్రహంబన,
దోఁచుకొన్నవాఁడె తోడునీడ!!

Saturday, September 24, 2011

సమస్యా పూరణ ద్వితీయ శతం - మూడవ భాగము


సమస్య 151: నారాయణ యనినవాఁడు నవ్వుల పాలౌ.
పేరేమి నీదని యడిగె
నారి యొకతి
, పేరు "సత్య నారాయణ"; తా
నోరు తిరగకయె
"తత్తి
న్నారాయణ" యనిన,
వాఁడు నవ్వుల పాలౌ!!
సమస్య 152: గడ్డముఁ జేసికొ మ్మనుచుఁ గాంతుఁడు భార్యకుఁ జెప్పె నవ్వుచున్.
వడ్డన చేయు వేళ మసి పాత్రలు పట్టగ యింతి, వాటిపై
జిడ్డును మడ్డియున్ మసియు చెక్కిలి చేరె శశాంకమోయనన్

గడ్దము వోలె తోచె మసి కాంత ముఖంబును జూచినంతటన్

గడ్డముఁ జేసికొ మ్మనుచుఁ గాంతుఁడు భార్యకుఁ జెప్పె నవ్వుచున్!!
సమస్య 153: పూలన్ దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్.
చాలిక లౌక్యపు కవితల్
కాలుని బాధ తొలుగుటకు కవులిక భక్తిన్

మేలగు పద్యంబుల చం

పూలన్ దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్!!


చంపూ = పద్య గద్యములతో కూడిన కావ్యము
సమస్య 154: మరణ మందినవాఁడె యమరుఁ డనఁ దగు.
మరణమది లేని వారలమరులు గాన
మరణమొందిన వారలమరులెటులగు
?
మంచితనమునకు కలదే మరణమేమి
?
మరణ మందినవాఁడె యమరుఁ డనఁ దగు!!
సమస్య 155: బాబాయే భార్యతోడ భజనకు వెడలెన్.
బాబాయికి పర కాంతల
ఫోబియ
, గుడిలో భజనకు పోరీలంతా
డాబుగ వచ్చునని తెలిసి

బాబాయే భార్యతోడ భజనకు వెడలెన్!!
సమస్య 156: రామమూర్తిఁ గన విరక్తి గలిగె.
అమర శిల్పులిచట యవతరించెను నాడు
నాటి కాలమింక దాటి పోయె

నేర్పు లేని శిల్పి నిలువుగ చెక్కిన

రామమూర్తిఁ గన విరక్తి గలిగె!!


మూర్తి = విగ్రహము
సమస్య 157: పిలువని పేరటమ్మునకుఁ బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!
వలసిన పాయసాన్నములు పప్పును పూర్ణము లడ్లు పూత రే
కులు పులిహోర యప్పడము కోరిన కూరలు భక్ష్యభోజ్యముల్

ఫలములు చారు క్షీరజము పాను పసందుగ విందులుండినన్

పిలువని పేరటమ్మునకుఁ బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!
సమస్య 158: నరసింహుం డాగ్రహించి నరకునిఁ జంపెన్.
ధరణి సుతుడు వరమహిమన్
తరుణులను మునీంద్రులను సతాయించంగన్

పరుడై సమ భావమ్ము త

నర సింహుం డాగ్రహించి నరకునిఁ జంపెన్!!


సింహుండు = విష్ణువు

{విష్ణు సహస్ర నామ స్తోత్రం:-
గభస్తినేమి: సత్త్వస్థ: సింహో భూతమహేశ్వర:!

ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు: !!
}
సమస్య 159: రణమె మనల కిఁక శరణము గాదె.
ఇద్దరు విడాకులు పొందిన యింతుల నడుమ సంభాషణ:-
మొగుని పైన మనకు మోజు తీరగ గృహ

హింస కేసు పెట్టి హింసఁ జేసి

అతి తెలివి విరియ విడాకులందితిమి భ

రణమె మనల కిఁక శరణము గాదె!!
సమస్య 160: వేప చెట్టున గాసెను వెలగ పండ్లు.
వేప పైన బదనికగ వెలగ మొలిచె
వెలగ చెట్టుకు కాసెను వెలగ పండ్లు

చూచు వారలు పలికిరి తోచినట్లు

"
వేప చెట్టున గాసెను వెలగ పండ్లు"!!

బదనిక = ఒక చెట్టు పైన మరో చెట్టుగా మొలిచినది
సమస్య 161: ఎన్నికలనఁగ రోతాయె నేమి కర్మ.
ఇరువురు పెళ్లి కాని యువతుల నడుమ సంభాషణ:-
సాప్టువేరు వరుడె సరియని తలచిన

.......కొలువెపుడూడునో తెలియ లేము!
బడి పంతులె మనకు బాగని తలచిన

.......బండెడు చాకిరి బ్రతుకులాయె!
డాక్టరె వరుడైన డాబని తలచిన

.......డాక్టరు డాక్టర్ని డాయునెపుడు!
లాయరు వరుడైన లాభమనుకొనిన

.......కేసులు రాకున్న కీడు కలుగు!

పెళ్లి పందిరి వారలు పిలిచి చూప

పెక్కు వరుల వివరములు
, లక్కు లేక
పెళ్లి కొడుకుల
జాబితా వెతికి, వరుని
యెన్నికలనఁగ రోతాయె నేమి కర్మ!!
సమస్య 162: తమ్ములఁ గాంచి కోపమునఁ దామరసేక్షణ తిట్టె నయ్యెడన్.
రమ్మని కోరగన్ ప్రియుని రాగము చిందిచు రాకయుండినన్
పమ్మిన కోపముల్ విరహ భావము నిండిన మానసంబునన్

ఝుమ్మని తుమ్మెదల్ వలపుఁ జూపుచు తామర పూలఁ జుట్టినన్

తమ్ములఁ గాంచి కోపమునఁ దామరసేక్షణ తిట్టె నయ్యెడన్.


తమ్ములు = తామర పూలు
సమస్య 163: కనకదుర్గ యిచ్చుఁ గష్టములను.
ఇంద్రుడిటుల పల్కె యిమ్ముగ సురలతో
కనక దుర్గ మనలఁ గాచునింక

మదము హెచ్చినట్టి మహిషాసురునకును

కనకదుర్గ యిచ్చుఁ గష్టములను!!
సమస్య 164: యతి మోహావేశ మెసఁగ నతివనుఁ బిలిచెన్.
గత రాత్రి జరిగె కలహము,
పతి మాటాడక బిగిసెను
, వయ్యారముగన్
మతి చెదర నవ్వగ వెలది

యతి మోహావేశ మెసఁగ నతివనుఁ బిలిచెన్!!


వెలది + అతి మోహావేశము = వెలది యతి మోహావేశము (యడాగమ సంధి)
సమస్య 165: మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి.
రాయబార నాటకమందు రమణులంత
పురుష పాత్రలుఁ గట్టిరి సరసముగను

పుట్టు మీసములే లేక పెట్టినట్టి

మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి!!
సమస్య 166: కవిని పెండ్లి యాడి కాంత వగచె.
సీస పద్యముఁ జెప్పు చెలియ సొగసు వీడి
......తేట గీతి పలుకు పైట వీడి
ఉత్పలమే గాని యోర కంటఁ గనడు

......ఆట వెలదియె సయ్యాట లేదు
మత్తేభమే వ్రాయు మరులుగొనగ రాడు

..... శార్దూలమే గాని శక్తి లేదు
చంపకమే గాని చెంప నిమర రాడు

..... ఉత్సాహమే గాని "ఉమ్మ" లేదు

కంద రచనఁ జేయు నందముఁ జూడడు

మత్త కోకిలఁ గను మగువఁ వీడి

తరళ కవిత వ్రాయు తరుణి తలపు లేక

కవిని పెండ్లియాడి కాంత వగచె!!
సమస్య 167: కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్.
సన్నని మీనులు జేరెను
కన్నులలోఁ,
జన్ను లమరెఁ గాంతామణికిన్
మిన్నగ
, మెయి కాంతులొలికె,
కన్నియ ప్రౌఢతనమొందు కాలమడుగిడన్!!
సమస్య 168: బిడ్డఁ గన్న తల్లి గొడ్డురాలు.
అడ్డ పాపగున్న బిడ్డగుదురు కాని
గడ్డములు మొలిచిన బిడ్డగుదెరె
?
ఫుడ్డు పెట్ట కుండ నడ్డి విఱిచినట్టి

బిడ్డఁ గన్న తల్లి గొడ్డురాలు
!!
సమస్య 169: సన్నుతిచేయు టొప్పగును సత్యవిదూరుల నిద్ధరాస్థలిన్..
పన్నిదమయ్యె జూదమున పాండవ రాజ్యము, వారు ధర్మమే
మిన్నని కానకేగిరి
, యమేయ బలాధికులైన వారలన్
సన్నుతిచేయు టొప్పగును,
సత్యవిదూరుల నిద్ధరాస్థలిన్
తన్నిన పాపమంటదు
, సదా వెలుగొందును సత్యమే ధరన్!!
సమస్య 170: భార్య లిద్దఱు శ్రీరామభద్రునకును.
రామ చరిత నాటకమాడ రంగు పూయ
మొదటి సీతకును జ్వరము మొదలు కాగ

జతగ రెండవ సీతను వెతికి తెచ్చె

భార్య లిద్దఱు శ్రీరామభద్రునకును!!

సమస్య 171: తలలొ క్కేబదినాల్గు కానఁబడియెన్ దద్గౌరి వక్షంబునన్.
(అర్థనారీశ్వరుడైన శివుడు వంద పడగల పామును ధరించి నాట్యము చెసేటప్పుటి పరిస్థితి)

కలిసెన్ దేహములొక్కటై గిరిజతో కైలాస శైలంబుపై

వెలసెన్ సాంబ శివుండు
, వంద పడగల్ వేష్టించి నర్తింపగన్
నలభై యారవి శీర్షముల్ భవునిపై నర్తించె మోదంబుగన్

తలలొ క్కేబదినాల్గు కానఁబడియెన్ దద్గౌరి వక్షంబునన్!!
సమస్య 172: కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు.
లక్ష్మి యెవనిని ముదముగ లగ్నమాడె?
ఇనకులజుఁడు విల్లు విఱిచి యేమి జేసె
?
విఘ్న నాయకుడెవ్వఁడు
? వివరమేమి?
కపిని,
కళ్యాణ మాడెను, గౌరి కొడుకు!!
సమస్య 173: కామిని కుచమధ్యమందు గరుడుం డాడెన్.
మామిడి పండ్లను పోలెడి
భామిని కుచముల నడుమున పక్షుల టాటూ

గోముగ వేయించుకొనిన

కామిని కుచమధ్యమందు గరుడుం డాడెన్!!
సమస్య 174: మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్.
మెతక మొగుళ్లను సాధిం
ప తయారయ్యెను కరుకుగ పలు చట్టమ్ముల్

సతిఁ గలిగిన వెతలిక
, శ్రీ
మతి లేని నరుండు మిగుల మన్నన నొందున్!!
సమస్య 175: కుత్తుకలు గోయువానికి కోటి నుతులు.
అఖిల జనులకు మాన్యుడే అన్న దాత
అన్న దాత కన్న నెవరు మిన్న కారు

నారుబోయు వానికి
, పండిన వరి పైరు
కుత్తుకలు గోయువానికి కోటి నుతులు
!!

Sunday, September 18, 2011

సమస్యా పూరణ ద్వితీయ శతం - రెండవ భాగము

సమస్య 126: మాధవుఁడు మాధవునితోడ మత్సరించె.

పలికె శిశుపాల పత్నులు బాధ తోడ
నిటుల " రాజసూయంబున కుటిల బుద్ది
మా ధవుఁడు (1) మాధవుని(2)తోడ మత్సరించె
కడకు మరణించి మమ్ముల విడిచి వెళ్లె"!!

(1)
మా ధవుఁడు = మా యొక్క భర్త = శిశుపాలుడు
(2)
మాధవునితో = లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణునితో

సమస్య 127: సింహమునెదిరించి గ్రామ సింహము గెలిచెన్

"ఓం హరి" యని కొలిచెడి కురు
సింహము భీష్ముని, విరోధి చిత్త భయకరున్
సంహారముఁ జేసె మగువ
సింహమునెదిరించి గ్రామ సింహము గెలిచెన్!!

సమస్య 128: తిరుమలేశునిఁ దిట్టిన సిరులు గలుగు

ఫండు వచ్చు ఫారిను నుండి, మెండుగ మత
మార్పిడులు సేయ, హైందవ మతము పైన
బురద చల్లిన చాలును ముందు, కాన
తిరుమలేశునిఁ దిట్టిన సిరులు గలుగు!!

సమస్య 129: వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుఁడు.

రాజకీయమయ్యెను నేడు రంగులన్ని
రంగు రంగుల జండాలు సంగమించి
నీచ కార్యములు సలుప చూచి నట్టి
వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుఁడు!!

సమస్య 130: పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురా.

చేల నడుమ చేఁబట్టుచు
పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురా!
కాలుని వంటి పహిల్వాన్
పోలేరమ్మకు పెనిమిటి, బొమికలు విఱుచున్!!

సమస్య 131: శ్రీరామునిఁ జూచి సీత చీకొట్టెఁ గదా!

వీరుఁడితండని వలచెను
శ్రీరామునిఁ జూచి సీత, చీకొట్టెఁ గదా
చోరుని రావణుని, సదా
శ్రీరామ పదములు గొల్చు సీతకు ప్రణతుల్!!

సమస్య 132: భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్.

బుల్లన యెద్దగు, బేరన
భల్లూకము, చదువుకొనఁగ బడిలోఁ జేరెన్
పిల్లడొకడు, షేర్లను కొని
ఘొల్లుమనెను వాటి ధరలు కుప్పగ కూలన్!!

సమస్య 133: ఆంజనేయున కొప్పెను హస్తిముఖము

కోర్కె తీర్చు ఘనులు కాగ, కోతి ముఖమె
ఆంజనేయున కొప్పెను, హస్తిముఖము
శివుని తనయునకొప్పెను, సింహ ముఖము
స్వర్ణ కశ్యప హంతకు సరిగ నమరె!!

సమస్య 134: ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు

సాప్టువేరు కొలువు, క్షణము తీరిక లేదు
తమి సమయమున పని దనుజుల వలె
అమెరికా సమయమె యాంధ్రాన మాకును
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు!!

సమస్య 135: పువ్వుఁబోడుల తల లెల్ల బోడు లయ్యె.

ఇమ్ముగ నటి యొకతి చాల నమ్మబలక
ప్రకటనల మోజులో కొని వాడినంత
కేశ వర్ధినీ తైలము కీడు జేయ
పువ్వుఁబోడుల తల లెల్ల బోడు లయ్యె!!

సమస్య 136: కవులు నియమములకుఁ గట్టుపడరు.

తొలుత పలికె రైతు "తొమ్మిది బస్తాల
కవులెకరమునకును" ఖండితముగను
పంట వచ్చు వేళ కుంటి సాకునుఁ జూపి
కవులు నియమములకుఁ గట్టుపడరు!!

సమస్య 137: పిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే.

చెల్లక మన సంస్కృతి విడి
యొల్లని సహ జీవనంబె యున్నతమనుచున్
చిల్లర తనమున తిరుగగ
పిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే!!

సమస్య 138: కారము గన్నులం బడినఁ గల్గును మోదము మానవాళికిన్.

కోరగ తెచ్చె కప్పు మన కూరిమి ధోని క్రికెట్టునందు, నా
భారత జట్టు గెల్చె, మది భారము తగ్గెను జూచినంతటన్,
గౌరవమొప్పె నేడు, బహుకాల విలంబనమైన స్వప్న సా
కారము గన్నులం బడినఁ గల్గును మోదము మానవాళికిన్!!

సమస్య 139: ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్.

మరిచిరె వసుదేవుని కథ
తరింప నాపదను గాడిద పదములంటెన్
నరులకు లౌక్యము ముఖ్యము
ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్!!

సమస్య 140: ధాత వ్రాసిన వ్రాతలె తప్పు లయ్యె.

తప్పక జరిగి తీరును ధాత చేతి
వ్రాత, నిజమిది తెలియును పండితులకు
ధాత వ్రాసిన వ్రాతలె, తప్పు లయ్యె
ప్రీతిగఁ గన కంప్యూటరు జాతకమ్మె!!

సమస్య 141: నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు.

పలికె కుంభ కర్ణుని తోడ పవన సూతి
"
నీకు యుద్ధమెందులకోయి నిదురఁ బోక?
నీల వర్ణుడు చంపడు నిద్రనున్న
నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు"

సమస్య 142: అంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు.

చిత్ర నాయికలకు నేడు సిగ్గు లేదు
చీరలంతరించి మిగిలె చిన్ని గౌన్లు
పేలికలె వస్త్రములు కాగ ప్రీతిఁ గని మ
దాంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు!!

సమస్య 143: పరుని పైన సాధ్వి మరులు గొనెను.

మూడు ముళ్ల వేళ ముగ్ద రీతిగ నుండె
ప్రథమ రాత్రి వేళ పతినిఁ జేరె
సిగ్గు వీడు వేళ శృంగార భావ త
త్పరుని పైన సాధ్వి మరులు గొనెను!!

నిష్ఠ తోడ నిలిచె నియమముగ నహల్య
గడప దాటి వెళ్లె గౌతముండు
చేటు కాలము తన చెంత చేరిన వేళ
పరుని పైన సాధ్వి మరులు గొనెను!!

సమస్య 144: లంచము మేయువారలె కళంకవిదూరులు నీతివర్తనుల్.

కాంచగ భారతావనిని కర్కము రీతిగ పట్టెనో గదా
లంచము మేయువారలె, కళంకవిదూరులు నీతివర్తనుల్
కుంచిత మార్గ దూరులను కొంచము నైనను కానజాలమో,
త్రుంచగ లంచగొండులను తొందర చేయుము భారతీయుడా!!

సమస్య 145: చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్.

కన్నీళ్లె మిగులు చివరికి
చిన్నిల్లున్ననె, కలుగు నశేషసుఖంబుల్
మిన్నగ నాదరమొప్పుచు
మన్ననఁ జేయు సతిగ నొక మగువ దొరికినన్!!

సమస్య 146: పిండి తక్కువైనను దోసె పెద్ద దయ్యె.

మొద్దు పెనము పై నాకును మోజు పోయె
కొంటి నాన్ స్టిక్కు పెనమును కొర్కెఁ గల్గ
అట్టు పలచగ పోసితి నంటకుండ
పిండి తక్కువైనను దోసె పెద్ద దయ్యె!!

సమస్య 147: వదినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్.

వదలక గడుసాడపడచు
వదినను ముద్దడిగె, మఱఁది పదుగురు చూడన్
పదములకును ప్రణమిల్లెను,
ముదిత వివాహ దినమందు మోదము తోడన్!!

సమస్య 148: నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

జనతా! జగనా! కిరణా!
ఘనమగు బాబూ! తెరాస! కమ్యూనిస్టా!
కొణిదల! వదలరు జనులిక
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!!

సమస్య 149: కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని.

మన్ను తినగ నేను చిన్నవాడనె తల్లి?
అన్న పలుకు నమ్మకమ్మ నీవు
నన్ను నమ్మవమ్మ నా నోరుఁ గనుమని
కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని!!

సమస్య 150: చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్.

ఆత్రపు తేనెటీగ చని యామని తేనెలు త్రాగు వేళలో
పాత్రత గల్గు పుష్పపు సువాసన హెచ్చుగ వచ్చు, హృద్యమౌ
చైత్రపు శోభలం గన; నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్
కుత్రిమ పూలమాలలను క్రొత్తగ తెచ్చి యలంకరింపగన్!!