Saturday, November 29, 2008

ఉగ్రవాదము

ఉ. నీచులు దుష్ట వర్తనులు, నిమ్న హృదాంతర రక్త దాహ ఫై
శాచిక వీచికల్, కుటిల శాత్రవ మాతృక భీజముల్, దయా
వాచక దూర వాసులు, సుభాషిత వాస్తవ తత్వ మాన్య సా
లోచన జన్య చిత్తజ విలోమము, వీరివి యుగ్ర వాదముల్!!

Saturday, September 13, 2008

ప్రకృతి ఘోష

నాయనలారా! నేను ప్రకృతి మాతను. మీ పర్యావరణాన్ని. నేను...
ఆ.వె. మమతలొలుకు మధుర మానసమూర్తిని
కల్మషంబు లేక కనికరింతు
సాధు గుణము తోడ సంచరించెడిదాన
నోర్మి గుణము కలిగి మిమ్ము కంటి!!


నిజమునకు నేను మీ తల్లుల కంటే మిన్న అయినదానను. ఏలనందురా..
తే. జనని గర్భమందుండిరి కొన్ని నాళ్లు
జనన మొందిన నాదిగ చచ్చు వరకు
వీడి పోవజాలరు నన్ను, వీలు కాదు
తల్లులను మించు తల్లిని తరచి చూడ!!


అట్టి నన్ను నేడు మీరు ఎంతటి క్షోభకు గురి చేయుచున్నారో తెలియునా? నాటి ఇక్షు రస తుల్య జల ప్రవాహ పూరిత నదీనదముల పరిస్థితి నేడు ఎమిటో తెలియునా...
కం. వ్యర్థ రసాయనములతో
తీర్థములెల్ల కలుషితము తీవ్రపు రీతిన్
స్వార్థముతో జీవన పర
మార్థమును గ్రహింపలేని మత్తులు మీరల్!!


ఇక ఆకాశము పరిస్థితి చూడుము...
తే. నింగి పొరలు నియతికల్గి నిలుపుచుండు
తపన కిరణ వర్జ్యములను తరణి నుండి
విష వాయువులంతట విస్తరించి
తల్లి వలె కాచు నింగిని చిల్లి పరిచె!!


ఇక మీరు వృక్ష జాతికి చేయు అపచారములు తక్కువేమి కాదు..
కం. కటకటపడ నా హృదయము
విటపములు నరికిరి మీరు, వేదన భరితై
బొటబొట యేడ్చిన నన్నున్
తటపట సేయక చరించు తనయల్ మీరల్!!


ఒక్క జలాకాశ వృక్ష తతులనియేమి నేడు ప్రకృతి సర్వమూ కలుషితంబాయె కదా..
తే. జలము పానార్హమును గాక కలుషితంబు
గాలి కలుషితంబు ధరణి కలుషితంబు
కలుషితంబు గగనమెల్ల, కలుషితంబు
ప్రకృతి యంత నీచ జనుల ప్రకృతివోలె!!

కం. అల్పమగు లాభములకై
స్వల్ప మతుల వోలె మీరు స్వార్థపు రీతిన్
కల్పాంతకాల జనితా
నల్పానర్థములు కోర న్యాయంబగునే!!

కం. రక్షించిన మిమ్ముల నే
రక్షించెడి దాన కాన రయమున మీరల్
రాక్షస బుద్దులు వీడుచు
వృక్ష తతుల రక్ష చేసి వృద్ది పరపరే!!

తే. తెలిసి తెలిసి చేయు పనుల తీరు మార్చి
కలసి మెలసి మీరలు నన్ను కావ వలయు
తలచి తలచి చూడుడు నేడు జాలి తోడ
అలసి పోతిని నేనిక పలుక జాల!!

- సత్య

Sunday, June 8, 2008

ఋతు పవనాలు

వర్షం వర్షం
కర్షక హర్షం
మలయ మారుతం
జలద స్పర్శకం
మేఘ గర్జనం
మెఱుపు ఉద్భవం
చినుకు చిటపటలు
పుడమి తహతహలు
వర్ష మేఘము
వసుధ చేరగ
మట్టి వాసనలు
మనసు భాషణలు
కారు మబ్బులు
ఏరు వాకలు
ఏటి దారులు
నీటి ధారలు
హల ధారులు
వ్యవసాయకులు
నాగలి నడకలు
సాగిన పొలములు
చిత్తడి భూములు
విత్తిన విత్తులు
ఆడుతు పాడుతు
నాటిన నాట్లూ
తడిసిన నేలలు
మొలచిన మొలకలు
కురిసిన వానలు
మురిసిన రైతులు
ఆగని అరకలు
తీసిన కలుపులు
పెరిగిన పైరులు
విరివిగ ఫలములు
దూసిన కొడవలి
కోసిన కోతలు
చేసిన కళ్లం
రాశిగ ధాన్యం
తోడుగ దైవం
చేరిన భాగ్యం
వర్షం వర్షం
కర్షక హర్షం
- సత్య

Wednesday, June 4, 2008

విజయ కాంక్ష

నిరాశను నిర్జించి
నిస్పృహని వర్జించి
నిన్నును నీవు
మిన్నగ యెంచి
అన్ని శక్తులు ధారవోసి
వేదన మాని
సాధన ఖడ్గం పూని
సోమరితనాన్ని
ఓటమి భయాన్ని
నిట్టనిలువుగా నరికివేసి
విజయ కాంత నొసటి తిలకమై
విహరిస్తూ వికసిస్తూ
గుండె బలం బుద్ది బలం
నిండుగున్న జయం జయం
అంటూ
నినదిస్తూ వినుతిస్తూ
ఓటమిని నిరసిస్తూ
గెలుపు వెలుగుకై పయనిస్తూ
ప్రయత్న లేముల పరిహసిస్తూ
నిరుత్సాహకరుల నిర్భరిస్తూ
ఉత్తేజం ఉత్సాహం
ఉవ్వెత్తున ఎగయ
ఉదయాద్రి ఉషస్సు
ఇనబింబ తేజస్సు
ముఖబింబమందు మెఱయ
విజయమే కలవరింతగ
విజయమే పలవరింతగ
విజయమే అంతటంతటా
అనువదిస్తూ అనుకరిస్తూ
అనుసరిస్తూ
విశ్రమించక విసుగు చెందక
విడిచి పెట్టక సాగిపో
నిశీధి లేదు నిర్వేదం రాదు
నిస్తేజం లేదు నిర్భాగ్యం రాదు
జయము నీదే ముదము నీదే
పరిశ్రమ ఫలితం నీదే
విజయ కాంత నిరంతర
దరహాస భాసురం నీదే
నీదే నీదే నీదే
- సత్య

Sunday, April 27, 2008

ప్రేయసి (ఖండ కావ్యం - రెండవ భాగం)

అంతట ఆమె నా ఎదుట నుండి కదలి పోయినది.

ఆ.వె. కదలిపోయె గాని వదన శశాంకము
వదల లేదు నాదు మదిని తాను
ఎదుట లేదు గాని ఎదను విడిచి లేదు
హృదయ మధ్యమంబు సదనమాయె!!

ఆ.వె. దూరమాయె గాని వర మనోహర మూర్తి
విరి శరముల బాధ తీర లేదు
దరిని లేదు గాని దరహాస వదనంబు
మరుని కరుణ కలుగు దారి లేదు!!

ఇక ఆ నాటినుండి నా లోచనాలకు తన రూపమే కాన వచ్చు. నా అలోచనల నిండా తన ధ్యాసే నిండియుండు.

ఆ.వె. కునుకు చేరదాయె తన తలపుల తోడ
ఊహలన్ని లోన దేహమామె
కనుల ముందు లేదు కమనీయ రూపము
కలలు వీడి పోదు నెలత మోము!!

ఆ.వె. మరపు రాక పోయె మరుని యింతిని పోలి
వలపు పుట్టసాగె నిలుప తరమె
అలవి కాని మనసు, వల్లకాకుండెను

తలపులన్ని నిలిచె నెలత పైన!!

ఆ.వె. మరల మరల మగువ మానసంబుకు వచ్చు
తలచి తలచి నాకు వలపు హెచ్చు
తాల లేక యున్న తనను కనుట లేక
వేళ కాని వేళ వేగిరమున!!

ఇక అన్ని వేళలా నా మానసంబు నిండా ఆమె తలపులే..

తే. నిదుర పోయెడి వేళ ఆ నెలత తలపె
మధ్య నిద్ర మేల్కాంచి ఆ మగువ తలపె
సుప్రభాతపు వేళ ఆ సుదతి తలపె
దంత ధావన వెళ ఆ యింతి తలపె!!

తే. స్నానమాడెడి వేళ ఆ జాని తలపె
వస్త్ర ధారణ వేళ ఆ వనిత తలపె
ఆరగించెడి వేళ ఆ అతివ తలపె
బయటకు వెడలు వేళ ఆ పడతి తలపె!!

తే. పనుల వేళలో పలుమార్లు మనసు చేరు
నిలువనీయదు చిత్తము నిమిషమైన
వల్ల కాకనుండెను నాకు వలపు తోడ
నుల్లమందున నిలిచెను పుల్ల నేత్రి!!

ఇంతకూ ఆమె ఎవరో.. ఎక్కడుండునో తెలియకుండెనుగదా.....

కం. ఎచ్చోటనుండునేమో
నచ్చిన చిన్నది ప్రియముగ మాటలాడన్..
నెచ్చెలి నెప్పుడు చూచెద?
చెచ్చర చూడగ చికీర్ష చిత్తము కలిగెన్!!

కం. విరజాజి విరుల రీతిన్
దరహాస సుమము విరిసిన, తన్మయమొందన్
దరి చేరి పలకరింపగ
సరియగు దారిని తెలియక సతమతమగుచున్...

కాని ఆలోచించి చూసిన, నాలో మునుపెన్నడిట్టి భావావేశము కలుగ లేదు. నేడు కలుగుటకు కారణంబేమి?

తే. మునుపు సుందర మూర్తుల కనులగంటి
నెన్నడిట్టి భావంబులు నెఱుగ లేదు
తా వలచినది రంభయు, తా మునిగిన
గంగ యందురు నిక్కము కాక పోదె!!

(సశేషం)
- సత్య
=============================




Saturday, April 19, 2008

ప్రేయసి (ఖండ కావ్యం - మొదటి భాగం)

అది ఒక సూర్యోదయ వేళ. బాల భాస్కరుడు తన లేలేత కిరణాలు ప్రసరిస్తున్న వేళ.మంచు పొరలు కరిగిపోతున్న సమయం.

ఉ. కాటుక చీకటుల్ తొలగి కాంతులు చిమ్ముచు కర్మ సాక్షి బా
హాటమునయ్యె, సిగ్గుగల హల్లక నేత్రికి మెల్లమెల్లగా
కూటమి వేళలన్ వదులు కోమలి సిగ్గుల రీతినంతటన్
తేటములాయె మంచు పొర తీవ్రత వృద్దికి సూర్యరశ్మికిన్!!

అట్టి సమయాన నేను ఉదయ వ్యాహ్యాళికి బయలుదేరినొక సుందరాంగిని చూచితిని..

సీ. చూచితి సురకన్య చూపుల పడతిని
కాంచితి కమనీయ కాంత రూపు
కనుగొంటి కమలారి ఆనన బింబము
కంటిని మీనముల్ కళ్ల లోన
దృష్టి నిల్పితి తన దివ్య లాస్యముపైన
నేత్ర పర్వంబాయె నెలత చూడ
పోల్చితి రూపున లచ్చికి సరియని
ఎఱిగితి పిమ్మట మరుని శరము

తే. విరుల గుబురులు వికసించి మరలి చూచు
శాంతి మూర్తీభవించిన యింతి, కుంద
రదన, సుందర సుకుమార వదన, సంప్ర
దాయమునకు నిలయమైన తరుణి తాను!!

ఆ అందాల కన్యను చూచినంతనే నా డెందంబునూగిసలాడి ఆనంద పరవశమయినది..

తే. కన్ను దోయికి కలిగెను మిన్నునంటు
సంబరంబు తనను చూడ చలనమొంది
తేజమొందెను వదనంబు తీరు మారి
హృదయమున నిజమైనట్టి యుదయమాయె!!

ఏమని వర్ణించను ఆ సుందర రూపాన్ని,ఏమని వర్ణించను ఆ మధురిమలొలుకు పలుకులను ...

ఆ.వె. సురల లోన సిరికి సరియగు తరళము
కీరవాణి కరణి తరుణి పలుకు
వరుల హృదయ ఝరులు మురిపాల కలియును
విరులు నిండు కురులు మరులు గొల్పు!!


ఆ ముగ్ద మనోహర మూర్తి అధరముల గురించి ఏమని చెప్పగలను...

కం. వలపుల కేళిన కలహపు
మొలకలు పొసమిన చిలకలు ముక్కులు మీటన్
నెలత పెదవులన్ మీటెను
చిలకలు కొన్ని బ్రమతోడ చిత్రపు రీతిన్!!


ఆ సౌందర్యమును చూచినంతనే నా మది నా అదుపు తప్పి పరి పరి విథాల చెదిరినది....

సీ. మేఘాల కౌగిలి మేలిమి ముసుగులు
తొలగిన చంద్రిక తోచె మదికి
అనురాగ మేఘాల జనితమయ్యెడి స్పుర
ద్విద్యుల్లత కరణి విశదమయ్యె
చల్లని వేళలనల్లన విరిసెడి
మొల్ల పువ్వుల రీతి తెల్లమాయె
మధుకర వాంఛిత మంజుల మాధురీ
మకరంద మందిర మాయె మదికి

తే. సర్వ శుభ లక్షణంబులు సరిగ కూర్చి
జేసిన పసిడి ముద్దగ వాసికెక్కు
బ్రహ్మ సృష్టికి మెఱుగులు కుమ్మరించు
చూచు వారు పుణ్యపు నోము నోచువారు!!

అట్టి ఆ పడతి అందచందాలు చూసిన నా మదికి యిటులనిపించె.....

తే. సకల సౌందర్య సంఘమ్ము నకలు కాగ
అసలు తానై నిలచియుండు దిశలనెల్ల
వలచి వచ్చిన చాలిట్టి వనిత నొకతి
వసుధ లోనే సుధారసం వశ్యమగును!!
(సశేషం)

- సత్య

===================================

Sunday, April 13, 2008

పెళ్లి పందిరి సందడి

సందళ్లు సేయరే సారసాక్షులారా
పందిళ్లు వేయరే కార్య దక్షులారా
అరుగులు అలకరే కలికి చిలకల్లరా
చాపలు పరవరే చంచలాక్షులారా
ముందుండి నడిపింపరే ముదిమి ముత్తైదుల్లారా
విందు వంటలు చూడరే విరిబోడుల్లారా
వడ పప్పు సేయరే వారిజాక్ష వనితలారా
పానకాలు కలపరే పడుచు పోరగాల్లారా
సర్వ సిద్దమవ్వరే సాధు పురుషులారా
అయ్యవారిని పిలవరే పరుగు పరుగు తోడ
చిన్నబుచ్చుకోకండి చిన్న విషయము లోన
పెద్దలే అందరూ ఉమ్మడి పండగలోన
పీటలెక్కరే ప్రియ దంపతులారా
సాటివచ్చు దివ్య సీతారాములారా

కుందనాల బొమ్మరో కన్య సీత చూడ
అందాల రాముడే కోరి జతను కూడె
నల్ల రాముని కంట నింపిన
సీత కంటికి కాటుకేలనో
బుగ్గ చుక్క కానవచ్చునే
నల్ల రాముని చెంప పైన
మస్తకము వంచె జానకి సిగ్గు తోడ
పుస్తె కట్టె పురుషోత్తముడు ప్రేమ తోడ
యుగము మారినా జగము మరవని జంట
సగముగా మారు నిగమ సారపు పంట!
-సత్య

Saturday, April 5, 2008

సమస్యా పూరణం: కలువ వికసించె సూర్యుని కరము సోకి

తే. బద్దకస్తుడొక్కండును మిద్దెనెక్కి
నిద్ర పోయె, లేచుటకై ప్రభాత వేళ,
మొద్దు నిద్ర వీడక పెట్టె ముసుగు, కంటి
కలువ వికసించె సూర్యుని కరము సోకి!

- జిగురు సత్యనారాయణ

Thursday, April 3, 2008

సమస్యా పూరణం:హనుమా! లక్ష్మిని పెండ్లియాడుమని యభ్యర్దించే నబ్ధీశుడున్

మ. ఘనమో క్షీర సముద్రమున్ జిలుకు లగ్నంబందు శ్రీదేవి తా
జనియించెన్ జలరాశి యింట, హరి విశ్వాత్ముండు విష్ణుండు యీ
వనితన్ చేకొన తగ్గవాడనుచు, దివ్యన్, సింధుజన్, ఘూక వా
హను, మా లక్ష్మిని పెండ్లి యాడుమని యభ్యర్థించె నబ్థీశుడున్!
- జిగురు సత్యనారాయణ

వివరణ: ఘూకం = గుడ్ల గూబ
ఘూక వాహన = గుడ్ల గూబను వాహనం గా కలిగినది = లక్ష్మీ దేవి

(అ)సమానత

ఒక వైపు.....................
అంబర చుంబిత సౌథంబులు
దివి తుల్య సుఖ భోగమ్ములు
జిహ్వ ప్రియకర రుచిరాన్నముల్
వివిథ శాస్త్ర విశాల విజ్ఞానముల్
చీనాబర ధారణ విభ్రమంబుల్
నియంత్రోష్ణకర యంత్ర జాలముల్
మాలిన్య నిర్మూలిత జల భాడంబుల్
విద్యుత్ దీప భాసిత భవనంబుల్
విహాయసోపమ విస్తార వీధుల్
సంచిత ధన నిక్షిప్త సంస్థల్

మరో వైపు....................
నీట మునుగు తాటాకు గుడిసెల్
నిత్య దరిద్ర భృత్య జనుల్
గంజి నీళ్ల గరీబీ గముల్
అక్షర శిక్షణ దక్షత దూరుల్
చినుగు చీరల మాటున స్త్రీల శీలముల్
ఘోర శీతల కాల భాధితుల్
కల్మశ పూరిత శాపాపస్సుల్
గాఢాంధకార బంధీ గృహముల్
పెక్కు ఇక్కట్ల ఇరుకు సంధుల్
యాచక హస్త రోధన తతుల్

తల్లీ! భారత జనయిత్రీ!
ఎక్కడ భిన్నత్వం లో ఏకత్వం?
ఎక్కడ అసమానతల నడుమ సమానత్వం?
ఎప్పుడు సర్వజనావళి సంతోషమగ్నులయ్యేది?
ఎప్పుడు విశ్వ శాంతి విరులు విరగబూసేది?
వేచి ఉన్నా! వేల కళ్లతో ఎదురు చూస్తున్నా!!
-సత్య

Tuesday, April 1, 2008

సమస్యా పూరణం: మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్

కం.వేసము వేసిన కలుగును
మీసములు పడతికిఁ జూడ, మిధ్యగ మారున్
వేసము తొలగింపంగన్
మీసాలే స్త్రీకి సొబగు ? మీరేమన్నన్!

వివరణ: మీసాలు + ఏ స్త్రీకి సొబగు ? = మీసాలే స్త్రీకి సొబగు ? ( మీసాలు ఏ స్త్రీకి సొబగు కాదు అని భావం)
- జిగురు సత్యనారాయణ

Monday, March 31, 2008

సమస్యా పూరణం:వాన దేవుడు కరుణించి వార్థి జొచ్చె

తే. సోమకాసురుడు శృతులు చోరి చేసి
సాగరంబున దాగెను వేగ రీతి
కుపిత చేపయ్యె విష్ణువు, కురిసె పూల
వాన, దేవుడు కరుణించి వార్థి జొచ్చె!
- సత్య

Sunday, March 30, 2008

సమస్యా పూరణం:కుంజర యూధమ్ము దోమకుత్తుక జొచ్చెన్

కం. రంజుగ పిల్లల కేళి స
రంజామాలోన మిగుల రాకసి దోమల్
కుంజర చిరు ప్రతిముండిన
కుంజర యూధమ్ము దోమకుత్తుక జొచ్చెన్
-సత్య

Saturday, March 29, 2008

సమస్యా పూరణం:రావణు జేరె సీత యను రాగము లొల్కెడు పల్కు లాడుచున్

ఉ. పావన మూర్తి రామునికి భార్యగ మారగ మాయ తోడుగన్
రావణ చెల్లి సూర్పనఖ రాక్షస కామిని మారె సీతగా
రావణు మార్చె రూపు వర రాముని వోలె ధరాత్మ జాతకై
రావణు జేరె సీత యను రాగము లొల్కెడు పల్కు లాడుచున్
-సత్య

Monday, March 24, 2008

తరుణీ! నా హృదయ తమః తరణీ!

వడలిపోని పుష్పమై ...నీ
జడను చేరాలనుకున్నా...
వదలి వెడలకు ప్రియతమా... నా
వడలు ఊపిరి తీయకు నిత్య చైత్రమా!

సడి లేని సంద్రమే ఇంతి అంతరంగం!
సుంతైన తెలపవు చెంతైన చేరవు!
గుడి లేని దైవమా! మది లోని భావమా!
వరమైనా ఇవ్వవు! దృక్ శరమైనా వెయ్యవు!

విరి తేనెల సరి పలుకుల సొగసరీ!
గిరి తావుల వడి జారు హృదయ ఝరీ!
సిరి రూప దరహాస మురిపాల బాలా!
అరవింద వదనా! అరమరలేలనే!
ఉరవడి మీర వలపులు తీర చేరవే!
తరుణీ! నా హృదయ తమః తరణీ!
- సత్య

Monday, March 17, 2008

హనుమత్శతకం (మొదటి భాగం)

తే. రామ సుగ్రీవ మైత్రీకరాంజనేయ
దాశరథి శోక నాశన ధైర్య దాత
సంద్ర లంఘన ఘన వీర శాంత శూర
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 1

తే. జానకీ శోక ఖండన జయ పతాక
కార్య ధీక్ష ధర విశేష సూర్య శిష్య
వ్యాకరణ పండిత కపీశ వారధి కృత
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 2

తే. పరమ పూజిత లక్ష్మణ ప్రాణ దాత
ఘన గగన గమన, విరోధి ఘనత దహన
వానర కుల జనిత శైవ వాక్పతి ప్రియ
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 3

తే. రామ కీర్తనమెక్కడ రమ్యమొందు
హస్త ముకుళితుడచ్చట హనుమ విథిగ
రాక్షసాంతక రఘు రామ రాజ ధారి
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 4

తే. మ్రొక్కితిని నీకు మారుతి దక్కితివని
నిక్కపు భగవంతుడవీవు దిక్కనుచును
రక్కసి గమిని త్రొక్కిన మర్కట వర
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 5

తే. అగ్గితో లంక భగ్గున బుగ్గియాయె
నిగ్గు దైత్యులు దిగ్గున నుగ్గు నుగ్గు
నెగ్గుటే కాని తగ్గుట నీకు లేదు
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 6

తే. వెచ్చనైన చిచ్చుకు తోక నొచ్చ లేదు
తెచ్చునుచ్చరించిన చాలు హెచ్చు బలము
రామ నామ జప మహిమ రక్ష మాకు
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 7

తే. పట్టు వీడని కేసరి పట్టి వీవు
కట్టుబడితివి బ్రహ్మాస్త్ర పట్టుకీవు
దిట్టవైన నిన్నెవ్వరు కొట్ట గలరు
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 8

తే. అక్షయ కుమార శిక్షక! రాక్షసారి!
లక్ష్య సాధన లక్షణ లక్షితవర
రామ సేవక! రక్షక! రక్ష! రక్ష!
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 9

Saturday, March 15, 2008

సరస్వతీ ప్రార్థన

తే.గీ. వందనాలు విద్యల తల్లి వందనాలు
వందనాలు వీణా పాణి వందనాలు
వందనాలమ్మ వాగ్దేవి వందనాలు
వందనాలు నీకున్ వంద వందనాలు!

- జిగురు సత్యనారాయణ

విఘ్నేశ్వర ప్రార్థన

ఆ.వె. వక్ర తుండ ప్రథమ వందిత జగదీశ
విశ్వనాథ పుత్ర విఘ్న రాజ
సిద్ది బుద్ది దాత శివ తనయ గణేశ
పరమ భక్త వరద పాహి పాహి!

ఉ. సన్నుతి చేసెదన్ పరమ శంకర పట్టిని పార్వతీ సుతన్
పన్నగ జంద్య ధారి ఘన పాతక హారిని విఘ్న రాజునిన్
విన్నతి వీనులొందనరవింద సుమంబుల పూజ సేతు నే
కన్నులు మూసి వేడెద వికార విశిష్ట విరూప ధారినిన్!
- జిగురు సత్యనారాయణ

Thursday, March 13, 2008

నువ్వే నువ్వే నువ్వే

నువ్వే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
కన్నుల ముందర నువ్వె
కన్నులు మూసిన నువ్వె
కలలోనైన నువ్వె
నా కన్నులలోన నువ్వె
నవ్వులు రువ్వె గువ్వవు నువ్వె
నా గుండెల మువ్వల సవ్వడి నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే

ఆదమరచి నిదురించే వేళ
ఆకతాయిగ కలలో వస్తావే
అల్లరి పనులెన్నో చేస్తావే
నిదురకు నను దూరం చేస్తావే
గిలిగింతలు పెడతావే
అలిగితినని ఆటాడిస్తావే
నవ్వులు రువ్వె గువ్వవు నువ్వె
నా గుండెల మువ్వల సవ్వడి నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే

ఎదురు వచ్చీ నువ్వే - ఎదను మీటి వెళ్లావే
కళ్ల తోన నవ్వీ - మేళమాడినావే
నాదు మదిని త్రొవ్వే - మధుర భావం నువ్వే
కవ్విస్తావే మైమరపిస్తావే
ఎవ్వరు ఇవ్వని విందులు ఇవ్వక దవ్వవుతావే
నవ్వులు రువ్వె గువ్వవు నువ్వె
నా గుండెల మువ్వల సవ్వడి నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే

దివ్వెల రవ్వల నవ్వుల జాణవులే
రివ్వున జివ్వున మదిలాగే జవ్వనివే
యవ్వన పువ్వుల మకరందానివే
చివ్వున లవ్వని నా దానవవ్వవే

నవ్వులు రువ్వె గువ్వవు నువ్వె
నా గుండెల మువ్వల సవ్వడి నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే

- సత్య

Wednesday, March 12, 2008

మోన శిక్ష

పదములతో పల్టీలు కొట్టి
ముదమొందితిననుకున్నా.... కానీ
ఎదుట వారి ఎదను
చిదిమితినని తెలియకున్నా

మదిలోని భావములు
వెదజల్లితిననుకున్నా....కానీ
విథము విహితము కాదని తెలియకున్నా

మాటకు మాట బదులాడి
తేట పరిచితిననుకున్నా...కానీ
మాటలోని ఘాటు
చేటు చేసి చేదు నింపుతుందని తెలియకున్నా

మరల బదులివ్వని నేస్తమా!
నీ మౌనమే నాకు శిక్ష!

-సత్య

నీవు లేక

నీవు లేని నా కనులు - జలపాతాలు
నా చూపులు - శూన్యాలు
నా హృదయం - అగ్ని శిఖా మధ్యస్తం
నా మది - కాలిన రాక్షస మసి బొగ్గు
నా వడలు కు - వల్లకాటి పై వలపు

ప్రియతమా! మరలి వస్తావు కదూ ..
మరులు కురుపిస్తావు కదూ ..
- సత్య

భగ్న ప్రేమ (A SATIRE)

వెలుగు జిలుగుల వెన్నెలలో
తళుకు బెళుకుల తళతళలో
కిలకిల నవ్వుల గలగల మాటల
మిలమిలలాడు కన్యను చూడ
డెందంబు గిలగిలలాడి
ఆనందంబున జలజల
పారెడిజలపాతపు హోరై
ప్రేమాతిశయమున గబగబ దరికి చేర
రుసరుసలాడిన వనితను చూచి
మనసు విలవిలలాడి
మోము వెలవెలబోయి
హ్రృదయం సలసలలాడెన్!
- సత్య

A Request to Moon

నిండు పున్నమి చంద్రమా - జ్వలిత శీతాగ్ని హోత్రమా
చిత్ర నక్షత్ర కళత్రమా - మానవ మానస మంత్రమా
తళుకు తారల మిత్రమా - రజనీ మనో క్షేత్రమా
నింగి లోని శ్వేత పత్రమా - చల్లదనాల కేంద్రమా
కవి కులాభిమానపాత్రమా - దేవ గురువుకు ఛాత్రమా
కలువ కుసుమ మిత్రమా - తమ్మి విరుల శాత్రమా

పెరిగి తరిగే వాడా - తరిగి పెరిగే వాడా
ఏ పక్షం నీ కైనా - నా పక్షం నిల్వరా
విహాయస గతిలో విహరించే ఇందుడా
సహాయము సేయ సత్వరమే రారా !!నిండు పున్నమి!!

నాకు మగువ పై వలపు
ఏల తెలపాలో తెలుపు
దారి చూపు - దరిని చేర్చు
ఇద్దరిని ఒకటిగ కూర్చు
మా ఇద్దరిని ఒకటిగ కూర్చు !!నిండు పున్నమి!!

తనను చూడ లేను - చూడకుండ ఉండ లేను
మాటలుండు మదిన - నోట రావు యేలనో
కాలకూటమే మ్రింగిన రీతి
విలవిలలాడె విఫల మనము
ఓపలేను ఈ బాథ - దాపలేను నా ప్రేమ
చూపవేరా దారి - ఏల దొరుకునో ఆ సుకుమారి
కల్లొల భరితమాయె మది
ముదిత మనసు పొందు మర్గమేది? !!నిండు పున్నమి!!

-సత్య

విజేత

బ్రతుకు నిత్య పొరాటం
గెలుపు కై నా ఆరాటం

ఓటమి ఎదుట ధీటుగ నిలుపు ధైర్యం కావాలి
భీతిని గోతిన పాతి పెట్టగల స్థైర్యం కావాలి

నిస్తేజపు అస్తమయాన్ని వీడి
నిశ్ఛల జ్వలిత నైజము చూపు
సూర్యుని నుండి స్పూర్తి పొందనా

ఎండ మంటను గుండె నింపుకొని
పండు వెన్నెల కురియు
నిండు చంద్రిక నుండి నీతిని నేర్వనా

కృషి వాకిట నిలచిన విజయ కాంత
తన ధీక్షా కౌగిలి చేరగ ఆహ్వనిస్తుంది
వడి వడిగ తన ఒడి చేరిన వాడే
విజేత అంటున్నది!
- సత్య

(మా)నవత్వం

జావ కారి పోయిందా జాతికి చైతన్యం
చావ లేక మనుతుందా చేవ లేని లోకం
లేవ లేక పొతుందా సోమరి పౌరుషం
ఆవలింతల మయమా యువత ఉద్రేకం
ఎవరికి వారేనా యమునా తీరానా?
స్వంత హితమే మిన్నా? సంఘ హితం కన్నా?

రండి రండి రండి లేచి రారండి
ఈ కుటిల లోకం పైకి
పటపట పళ్ళు కొఱుకుతు
నిటలాక్ష జటా జూట జనిత
భద్రుని వలె - వీర భద్రుని వలె
రండి రండి రండి లేచి రారండి

స్వార్థాలను ధిక్కరిస్తూ
అవినీతిని నిగ్గదీస్తూ
దిక్కులు పిక్కటిల్లగ
నిక్కపు మాటలు మాటాడ
రండి రండి రండి లేచి రారండి

అగ్గివోలె జ్వలిద్దాం
నింగి పైకి ఎగురుదాం
వెలుగులు పంచుదాం
విలువలు పెంచుదాం
రండి రండి రండి లేచి రారండి

ఇచ్ఛ మనది స్వేచ్ఛ మనది
తుచ్ఛ లోకం నొచ్చుకున్న మెచ్చకున్న
స్వచ్ఛమైన బాట వీడక
రండి రండి రండి లేచి రారండి

ఇజాలు పలకక
నిజాలు పలుకుతు
ప్రజావళి ముదమొంద
రండి రండి రండి లేచి రారండి

విడివిడి గొంతులు ఒకటిగ
సుడిగాలి సునామీలా
సడి చేస్తూ నినదిద్దాం
తడబడక వడివడిగ
అడుగులు వేస్తూ
రండి రండి రండి లేచి రారండి

పాదాలు కదుపుతు
జీవన వేదాలు నిర్దేశిస్తూ
శోధిద్దాం భువనాన్ని
సాధిద్దాం విజయాన్ని
రండి రండి రండి లేచి రారండి

వెతలు రావు, గతులు మారు
చితికిన బతుకు చితుల నిప్పే
చేతనమైతే
రండి రండి రండి లేచి రారండి

జావ కారి పోయిందా జాతికి చైతన్యం
చావ లేక మనుతుందా చేవ లేని లోకం
మారుదాం! మార్చుదాం!
మరుగుపడి మరణించిన మానవత్వాన్ని
మళ్ళీ మకుటాయమానంగా మార్చుదాం
రండి రండి రండి లేచి రారండి
రండి రండి రండి వచ్చి నాలో కలవండి!
- సత్య