Saturday, September 13, 2008

ప్రకృతి ఘోష

నాయనలారా! నేను ప్రకృతి మాతను. మీ పర్యావరణాన్ని. నేను...
ఆ.వె. మమతలొలుకు మధుర మానసమూర్తిని
కల్మషంబు లేక కనికరింతు
సాధు గుణము తోడ సంచరించెడిదాన
నోర్మి గుణము కలిగి మిమ్ము కంటి!!


నిజమునకు నేను మీ తల్లుల కంటే మిన్న అయినదానను. ఏలనందురా..
తే. జనని గర్భమందుండిరి కొన్ని నాళ్లు
జనన మొందిన నాదిగ చచ్చు వరకు
వీడి పోవజాలరు నన్ను, వీలు కాదు
తల్లులను మించు తల్లిని తరచి చూడ!!


అట్టి నన్ను నేడు మీరు ఎంతటి క్షోభకు గురి చేయుచున్నారో తెలియునా? నాటి ఇక్షు రస తుల్య జల ప్రవాహ పూరిత నదీనదముల పరిస్థితి నేడు ఎమిటో తెలియునా...
కం. వ్యర్థ రసాయనములతో
తీర్థములెల్ల కలుషితము తీవ్రపు రీతిన్
స్వార్థముతో జీవన పర
మార్థమును గ్రహింపలేని మత్తులు మీరల్!!


ఇక ఆకాశము పరిస్థితి చూడుము...
తే. నింగి పొరలు నియతికల్గి నిలుపుచుండు
తపన కిరణ వర్జ్యములను తరణి నుండి
విష వాయువులంతట విస్తరించి
తల్లి వలె కాచు నింగిని చిల్లి పరిచె!!


ఇక మీరు వృక్ష జాతికి చేయు అపచారములు తక్కువేమి కాదు..
కం. కటకటపడ నా హృదయము
విటపములు నరికిరి మీరు, వేదన భరితై
బొటబొట యేడ్చిన నన్నున్
తటపట సేయక చరించు తనయల్ మీరల్!!


ఒక్క జలాకాశ వృక్ష తతులనియేమి నేడు ప్రకృతి సర్వమూ కలుషితంబాయె కదా..
తే. జలము పానార్హమును గాక కలుషితంబు
గాలి కలుషితంబు ధరణి కలుషితంబు
కలుషితంబు గగనమెల్ల, కలుషితంబు
ప్రకృతి యంత నీచ జనుల ప్రకృతివోలె!!

కం. అల్పమగు లాభములకై
స్వల్ప మతుల వోలె మీరు స్వార్థపు రీతిన్
కల్పాంతకాల జనితా
నల్పానర్థములు కోర న్యాయంబగునే!!

కం. రక్షించిన మిమ్ముల నే
రక్షించెడి దాన కాన రయమున మీరల్
రాక్షస బుద్దులు వీడుచు
వృక్ష తతుల రక్ష చేసి వృద్ది పరపరే!!

తే. తెలిసి తెలిసి చేయు పనుల తీరు మార్చి
కలసి మెలసి మీరలు నన్ను కావ వలయు
తలచి తలచి చూడుడు నేడు జాలి తోడ
అలసి పోతిని నేనిక పలుక జాల!!

- సత్య

6 comments:

  1. సత్య గారు,
    మొదట మీ బ్లాగులోకి ప్రవేశాన్ని content warning ఆపుతుంది,కామెంటు రాయాలంటే word verification అపుతుంది,ఇక మీరు ఫాంటు/రంగులను అర్జంటుగా మార్చాలి.కళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాయ్ మరి.
    అలాగే మీరు http://pichukalu.blogspot.com/ ఒక్కసారి చూడండి.

    ReplyDelete
  2. రాజేంద్ర కుమార్ గారు,
    మీరు చెప్పిన మార్పులు నా Blogకి చేసినాను. మీ "పిచుకలు" Blogను తప్పకుండా చూస్తాను.
    - సత్య

    ReplyDelete
  3. పద్యాలు బాగున్నాయి

    ReplyDelete
  4. పద్యాలలో పర్యావరణ స్పృహ పలికించటం అసాద్యమైనా అద్భుతంగా పలికించారు. ఎందుకంటే చానాళ్లక్రితం, ఒక వచన కవిత వ్రాయబోయి ముప్పుతిప్పలు పడ్డాను నేను. :-) ఈ లింక్ చూడండి.

    http://battibandh.wordpress.com/2008/05/20/%E0%B0%85%E0%B0%B5%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%8F%E0%B0%AE%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF/

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. చాలా అర్థవంతంగా ఉన్నాయి పద్యాలు
    తే. జనని గర్భమందుండిరి కొన్ని నాళ్లు
    జనన మొందిన నాదిగ చచ్చు వరకు
    వీడి పోవజాలరు నన్ను, వీలు కాదు
    తల్లులను మించు తల్లిని తరచి చూడ!!
    excellent.

    ReplyDelete
  6. @ బాబా గారు
    @ తెలుగు అభిమాని గారు,
    వ్యాక్యానించినందుకు ధన్యవాదములు.

    @ బాబా గారు,
    మీ కవిత చదివాను. బాగుంది. నేను సమస్యను మాత్రమే చూపిస్తే మీరు అందుకు నివారణను కూడ సూచించారు.

    నా పద్యాలలో నాకు తెలిసినంతలో రెండు చోట్ల "ప్రాస యతి" తప్పింది.

    ReplyDelete