Sunday, April 27, 2008

ప్రేయసి (ఖండ కావ్యం - రెండవ భాగం)

అంతట ఆమె నా ఎదుట నుండి కదలి పోయినది.

ఆ.వె. కదలిపోయె గాని వదన శశాంకము
వదల లేదు నాదు మదిని తాను
ఎదుట లేదు గాని ఎదను విడిచి లేదు
హృదయ మధ్యమంబు సదనమాయె!!

ఆ.వె. దూరమాయె గాని వర మనోహర మూర్తి
విరి శరముల బాధ తీర లేదు
దరిని లేదు గాని దరహాస వదనంబు
మరుని కరుణ కలుగు దారి లేదు!!

ఇక ఆ నాటినుండి నా లోచనాలకు తన రూపమే కాన వచ్చు. నా అలోచనల నిండా తన ధ్యాసే నిండియుండు.

ఆ.వె. కునుకు చేరదాయె తన తలపుల తోడ
ఊహలన్ని లోన దేహమామె
కనుల ముందు లేదు కమనీయ రూపము
కలలు వీడి పోదు నెలత మోము!!

ఆ.వె. మరపు రాక పోయె మరుని యింతిని పోలి
వలపు పుట్టసాగె నిలుప తరమె
అలవి కాని మనసు, వల్లకాకుండెను

తలపులన్ని నిలిచె నెలత పైన!!

ఆ.వె. మరల మరల మగువ మానసంబుకు వచ్చు
తలచి తలచి నాకు వలపు హెచ్చు
తాల లేక యున్న తనను కనుట లేక
వేళ కాని వేళ వేగిరమున!!

ఇక అన్ని వేళలా నా మానసంబు నిండా ఆమె తలపులే..

తే. నిదుర పోయెడి వేళ ఆ నెలత తలపె
మధ్య నిద్ర మేల్కాంచి ఆ మగువ తలపె
సుప్రభాతపు వేళ ఆ సుదతి తలపె
దంత ధావన వెళ ఆ యింతి తలపె!!

తే. స్నానమాడెడి వేళ ఆ జాని తలపె
వస్త్ర ధారణ వేళ ఆ వనిత తలపె
ఆరగించెడి వేళ ఆ అతివ తలపె
బయటకు వెడలు వేళ ఆ పడతి తలపె!!

తే. పనుల వేళలో పలుమార్లు మనసు చేరు
నిలువనీయదు చిత్తము నిమిషమైన
వల్ల కాకనుండెను నాకు వలపు తోడ
నుల్లమందున నిలిచెను పుల్ల నేత్రి!!

ఇంతకూ ఆమె ఎవరో.. ఎక్కడుండునో తెలియకుండెనుగదా.....

కం. ఎచ్చోటనుండునేమో
నచ్చిన చిన్నది ప్రియముగ మాటలాడన్..
నెచ్చెలి నెప్పుడు చూచెద?
చెచ్చర చూడగ చికీర్ష చిత్తము కలిగెన్!!

కం. విరజాజి విరుల రీతిన్
దరహాస సుమము విరిసిన, తన్మయమొందన్
దరి చేరి పలకరింపగ
సరియగు దారిని తెలియక సతమతమగుచున్...

కాని ఆలోచించి చూసిన, నాలో మునుపెన్నడిట్టి భావావేశము కలుగ లేదు. నేడు కలుగుటకు కారణంబేమి?

తే. మునుపు సుందర మూర్తుల కనులగంటి
నెన్నడిట్టి భావంబులు నెఱుగ లేదు
తా వలచినది రంభయు, తా మునిగిన
గంగ యందురు నిక్కము కాక పోదె!!

(సశేషం)
- సత్య
=============================




No comments:

Post a Comment