Sunday, September 18, 2011

సమస్యా పూరణ ద్వితీయ శతం - రెండవ భాగము

సమస్య 126: మాధవుఁడు మాధవునితోడ మత్సరించె.

పలికె శిశుపాల పత్నులు బాధ తోడ
నిటుల " రాజసూయంబున కుటిల బుద్ది
మా ధవుఁడు (1) మాధవుని(2)తోడ మత్సరించె
కడకు మరణించి మమ్ముల విడిచి వెళ్లె"!!

(1)
మా ధవుఁడు = మా యొక్క భర్త = శిశుపాలుడు
(2)
మాధవునితో = లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణునితో

సమస్య 127: సింహమునెదిరించి గ్రామ సింహము గెలిచెన్

"ఓం హరి" యని కొలిచెడి కురు
సింహము భీష్ముని, విరోధి చిత్త భయకరున్
సంహారముఁ జేసె మగువ
సింహమునెదిరించి గ్రామ సింహము గెలిచెన్!!

సమస్య 128: తిరుమలేశునిఁ దిట్టిన సిరులు గలుగు

ఫండు వచ్చు ఫారిను నుండి, మెండుగ మత
మార్పిడులు సేయ, హైందవ మతము పైన
బురద చల్లిన చాలును ముందు, కాన
తిరుమలేశునిఁ దిట్టిన సిరులు గలుగు!!

సమస్య 129: వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుఁడు.

రాజకీయమయ్యెను నేడు రంగులన్ని
రంగు రంగుల జండాలు సంగమించి
నీచ కార్యములు సలుప చూచి నట్టి
వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుఁడు!!

సమస్య 130: పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురా.

చేల నడుమ చేఁబట్టుచు
పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురా!
కాలుని వంటి పహిల్వాన్
పోలేరమ్మకు పెనిమిటి, బొమికలు విఱుచున్!!

సమస్య 131: శ్రీరామునిఁ జూచి సీత చీకొట్టెఁ గదా!

వీరుఁడితండని వలచెను
శ్రీరామునిఁ జూచి సీత, చీకొట్టెఁ గదా
చోరుని రావణుని, సదా
శ్రీరామ పదములు గొల్చు సీతకు ప్రణతుల్!!

సమస్య 132: భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్.

బుల్లన యెద్దగు, బేరన
భల్లూకము, చదువుకొనఁగ బడిలోఁ జేరెన్
పిల్లడొకడు, షేర్లను కొని
ఘొల్లుమనెను వాటి ధరలు కుప్పగ కూలన్!!

సమస్య 133: ఆంజనేయున కొప్పెను హస్తిముఖము

కోర్కె తీర్చు ఘనులు కాగ, కోతి ముఖమె
ఆంజనేయున కొప్పెను, హస్తిముఖము
శివుని తనయునకొప్పెను, సింహ ముఖము
స్వర్ణ కశ్యప హంతకు సరిగ నమరె!!

సమస్య 134: ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు

సాప్టువేరు కొలువు, క్షణము తీరిక లేదు
తమి సమయమున పని దనుజుల వలె
అమెరికా సమయమె యాంధ్రాన మాకును
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు!!

సమస్య 135: పువ్వుఁబోడుల తల లెల్ల బోడు లయ్యె.

ఇమ్ముగ నటి యొకతి చాల నమ్మబలక
ప్రకటనల మోజులో కొని వాడినంత
కేశ వర్ధినీ తైలము కీడు జేయ
పువ్వుఁబోడుల తల లెల్ల బోడు లయ్యె!!

సమస్య 136: కవులు నియమములకుఁ గట్టుపడరు.

తొలుత పలికె రైతు "తొమ్మిది బస్తాల
కవులెకరమునకును" ఖండితముగను
పంట వచ్చు వేళ కుంటి సాకునుఁ జూపి
కవులు నియమములకుఁ గట్టుపడరు!!

సమస్య 137: పిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే.

చెల్లక మన సంస్కృతి విడి
యొల్లని సహ జీవనంబె యున్నతమనుచున్
చిల్లర తనమున తిరుగగ
పిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే!!

సమస్య 138: కారము గన్నులం బడినఁ గల్గును మోదము మానవాళికిన్.

కోరగ తెచ్చె కప్పు మన కూరిమి ధోని క్రికెట్టునందు, నా
భారత జట్టు గెల్చె, మది భారము తగ్గెను జూచినంతటన్,
గౌరవమొప్పె నేడు, బహుకాల విలంబనమైన స్వప్న సా
కారము గన్నులం బడినఁ గల్గును మోదము మానవాళికిన్!!

సమస్య 139: ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్.

మరిచిరె వసుదేవుని కథ
తరింప నాపదను గాడిద పదములంటెన్
నరులకు లౌక్యము ముఖ్యము
ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్!!

సమస్య 140: ధాత వ్రాసిన వ్రాతలె తప్పు లయ్యె.

తప్పక జరిగి తీరును ధాత చేతి
వ్రాత, నిజమిది తెలియును పండితులకు
ధాత వ్రాసిన వ్రాతలె, తప్పు లయ్యె
ప్రీతిగఁ గన కంప్యూటరు జాతకమ్మె!!

సమస్య 141: నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు.

పలికె కుంభ కర్ణుని తోడ పవన సూతి
"
నీకు యుద్ధమెందులకోయి నిదురఁ బోక?
నీల వర్ణుడు చంపడు నిద్రనున్న
నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు"

సమస్య 142: అంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు.

చిత్ర నాయికలకు నేడు సిగ్గు లేదు
చీరలంతరించి మిగిలె చిన్ని గౌన్లు
పేలికలె వస్త్రములు కాగ ప్రీతిఁ గని మ
దాంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు!!

సమస్య 143: పరుని పైన సాధ్వి మరులు గొనెను.

మూడు ముళ్ల వేళ ముగ్ద రీతిగ నుండె
ప్రథమ రాత్రి వేళ పతినిఁ జేరె
సిగ్గు వీడు వేళ శృంగార భావ త
త్పరుని పైన సాధ్వి మరులు గొనెను!!

నిష్ఠ తోడ నిలిచె నియమముగ నహల్య
గడప దాటి వెళ్లె గౌతముండు
చేటు కాలము తన చెంత చేరిన వేళ
పరుని పైన సాధ్వి మరులు గొనెను!!

సమస్య 144: లంచము మేయువారలె కళంకవిదూరులు నీతివర్తనుల్.

కాంచగ భారతావనిని కర్కము రీతిగ పట్టెనో గదా
లంచము మేయువారలె, కళంకవిదూరులు నీతివర్తనుల్
కుంచిత మార్గ దూరులను కొంచము నైనను కానజాలమో,
త్రుంచగ లంచగొండులను తొందర చేయుము భారతీయుడా!!

సమస్య 145: చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్.

కన్నీళ్లె మిగులు చివరికి
చిన్నిల్లున్ననె, కలుగు నశేషసుఖంబుల్
మిన్నగ నాదరమొప్పుచు
మన్ననఁ జేయు సతిగ నొక మగువ దొరికినన్!!

సమస్య 146: పిండి తక్కువైనను దోసె పెద్ద దయ్యె.

మొద్దు పెనము పై నాకును మోజు పోయె
కొంటి నాన్ స్టిక్కు పెనమును కొర్కెఁ గల్గ
అట్టు పలచగ పోసితి నంటకుండ
పిండి తక్కువైనను దోసె పెద్ద దయ్యె!!

సమస్య 147: వదినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్.

వదలక గడుసాడపడచు
వదినను ముద్దడిగె, మఱఁది పదుగురు చూడన్
పదములకును ప్రణమిల్లెను,
ముదిత వివాహ దినమందు మోదము తోడన్!!

సమస్య 148: నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

జనతా! జగనా! కిరణా!
ఘనమగు బాబూ! తెరాస! కమ్యూనిస్టా!
కొణిదల! వదలరు జనులిక
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!!

సమస్య 149: కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని.

మన్ను తినగ నేను చిన్నవాడనె తల్లి?
అన్న పలుకు నమ్మకమ్మ నీవు
నన్ను నమ్మవమ్మ నా నోరుఁ గనుమని
కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని!!

సమస్య 150: చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్.

ఆత్రపు తేనెటీగ చని యామని తేనెలు త్రాగు వేళలో
పాత్రత గల్గు పుష్పపు సువాసన హెచ్చుగ వచ్చు, హృద్యమౌ
చైత్రపు శోభలం గన; నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్
కుత్రిమ పూలమాలలను క్రొత్తగ తెచ్చి యలంకరింపగన్!!

No comments:

Post a Comment