Friday, September 16, 2011

సమస్యా పూరణ ద్వితీయ శతం - మొదటి భాగము

సమస్య 101: చీర గట్టెను పురుషుండు సిగ్గుపడక.

సాంబ శివునిఁజూడ శివుఁడు సగము గిరిజ
సగము, పులి తోలు చీరయు సగము సగము,
నిగమ పురుషుండె యీరీతి మగడు కాగ
చీర గట్టెను పురుషుండు సిగ్గుపడక.

సమస్య 102: అమ్మను పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్.

కమ్మని పెళ్లిలోన వర కట్నము వద్దని జెప్పి తండ్రియే
యిమ్ముగ పల్కెనీ పగిది "యీతడు నా కొమరుండు గాన నే
నమ్మను"; పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్
సొమ్మును స్వీకరించకయె సూత్రముఁ గట్టెను ప్రేమ మీరగన్!!

నేను + అమ్మను = నేనమ్మను

సమస్య 103: తల్లిని దండించువాఁడు ధన్యుఁడు గదరా!

తొల్లి భృగుపత్ని వ్రతమున
తల్లడఁ బెట్ట దివిజులను, దానిని సంద్ర
మ్మల్లుడు జంపెను, శుక్రుని
తల్లిని దండించువాఁడు ధన్యుఁడు గదరా!

సంద్రమ్ము + అల్లుడు = సంద్రమ్మల్లుడు (విష్ణువు)
(పూర్వము భృగుమహర్షి భార్య, శుక్రుని తల్లి అయిన "ఉశన", దేవతలను సంహరించడానికి ధృడ వ్రతము చేయుచుండగా, విష్ణువు ఆమెను సంహరించినాడు.)

సమస్య 104: మునికి క్రోధమ్ము భూషణ మ్మనుట నిజము.

రామ బంటుకు, సీతా లలామ శోక
హరునకు , కపికి, లంకా దహనునకు, ఘన
నుత చరితునకు, భక్త హనుమకు, శివ స
మునికి క్రోధమ్ము భూషణ మ్మనుట నిజము.

సమస్య 105: మలిన కళంక జీవితను మైథిలి జేకొనుమయ్య రాఘవా!!!

శ్రీ రామునితో హనుమంతుడు పలుకు మాటలు:-

విలువలు సిగ్గు లేని అవివేకులు పిచ్చిగ మాటలాడగన్

తెలపగ వచ్చునే? భ్రమసి తేనియ చేదను మూర్ఖులేగదా!

తలపున తాను నిన్ను సతతమ్ముగఁ గొల్చును! దోషమేమి? కో

మలి నకళంక జీవితను మైథిలిఁ జేకొనుమయ్య రాఘవా !!!

కోమలిన్ + అకళంక = కోమలినకళంక

సమస్య 106: నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్.

ప్రీతిగ నీకును గంగా!
నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్,
నీ తల పొగరును దించగ
చేతనగును నాకు, సాంబ శివుడను నేనే!

సమస్య 107: దిక్కు లేనివాఁడు దినకరుండు!

కక్ష గట్టినారు గ్రహణ సమయమందు
రాహు కేతువులన రక్ష కలదె?
దినకరుండునైన దీనుడే! రక్షించు
దిక్కు లేనివాఁడు దినకరుండు!

సమస్య 108: కాంతాలోలుండె మోక్షగామి గనంగన్.

చింతించెను మండోదరి
కాంతుడు తన ముక్తి కొఱకు , కమలాక్షిని శ్రీ
కాంతను దొంగిలి తెచ్చెను
కాంతాలోలుండె మోక్షగామి గనంగన్!!

సమస్య 109: చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్.

చంపక మాలలో లఘువు చక్కగ నిల్చును ముందు చూడగా

నింపగ నుత్పలంబుగను నేర్పున నిల్చును గుర్వు ముందుగన్

సొంపుగ వెంట వెంటగను జూప గురుద్వయమున్ గణాలలో

చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్.

(రెండు గురువులను వెంట వెంట వ్రాయాలంటే చంపక మాల పనికి రాదు. ఉత్పల మాలయితే ఒక గురువును పాదము చివరలోను రెండవ గురువును తరువాతి పాదము మొదటి అక్షరముగా వేసి "UU" ని సాధించవచ్చు.)

సమస్య 110: రామచరిత్రముఁ జదువఁగ రాదు కుమారా!

లేమ యొకతి వ్రాసెను ఘన
రామ చరితము విష వృక్ష రాజమ్మనుచున్
రాముని తిట్టుచు వ్రాసిన
రామచరిత్రముఁ జదువఁగ రాదు కుమారా!

సమస్య 111: కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్.

కలకలమునకు హృదయమే
నిలయము కాగ కవి యొకడు నియమము తోడన్
కొలిచెను వాగ్దేవిని, కల
కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్.

సమస్య 112: హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో.

శివరాత్రి రోజంతా అభిషేకాలు చేసి చేసి మంత్రాలు చదవటము అలవాటైన పురోహితుఁడి పరిస్థితి:-,
"హర హర శంకరా!" యనుచు న్యాసముతో పలు మార్లు పల్కి వే
ద రవము మింటినంటగ సదాశివుఁడౌను పురోహితుండు, తాన్
పురహర మంత్రముల్ మరచి పోవక శంకర రాత్రి పిమ్మటన్
హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో.

సమస్య 113: భీముఁడు భీష్ముఁ జంపె నతి భీకర లీల జగమ్ము మెచ్చఁగన్.

సంజయుడు దృతరాష్ట్రునితో పలుకు మాటలు:-
ఏమని చెప్పెదన్ కురు కులేంద్ర! ప్రమోదము లేదు సుంతయున్
కోమలి కృష్ణ కోపమున కోరగఁ జంపెను నీ కుమారునిన్
భీముఁడు, భీష్ముఁ జంపె నతి భీకర లీల జగమ్ము మెచ్చఁగన్
గోముగ గుండె పైన పడు కుంతి సుతుండు కిరీటి వింతగన్!!

సమస్య 114: శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?

రామచంద్రుడు కడు త్రాగుబోతనుచును
శిష్టుఁ డెట్లు పల్కు? శివ శివ యని
చెవులు మూసు కొనును చెవిసోకినంతట,
పలుకు వానికేమి విలువ కలదు?

సమస్య 115: చచ్చి నంతనె చేఁతురు సంబరములు.

మొదట మొహమాటము వరుని మదిన కలుగు,
బేల చూపు తోడ వధువు బెరుకుఁ జూపు
వలపు తలఁపులు గెలువఁగ, వారి సిగ్గు
చచ్చి నంతనె, చేఁతురు సంబరములు.

సమస్య 116: మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.

గుడి ఫ్రక్కన బారు వెలసె
విడువక పూజారినంత వేద ద్రోహుల్
మెడబట్టి త్రాపె మద్యము
మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.

సమస్య 117: తుందిలుఁ గని మన్మథుఁడని తొయ్యలి మురిసెన్.

అందమ్ము లేదు నాకున్
సందేహంబేల మదిన సరసపు వేళన్
పందిరి మంచము పైనని
తుందిలుఁ గని మన్మథుఁడని తొయ్యలి మురిసెన్.

సమస్య 118: కాశి కేఁగువాఁడు ఖలుఁడు గాఁడె.

పరులఁ జంపినంత పరమ పదమనుచు
టెర్రరిస్టు పేర విర్ర వీగి
ప్రజలఁ జంపఁ గోరి బాంబులు పెట్టగ
కాశి కేఁగువాఁడు ఖలుఁడు గాఁడె.

సమస్య 119: పెండ్లి సేయఁదగును ప్రేతమునకు.

పాల పీక చాలు పాపకు, కన్యకు
పెండ్లి సేయఁదగును, ప్రేతమునకు
పిండ దానమె గతి, విషయమేదైనను
విందు భోజనంబె బందువులకు!!

సమస్య 120: మెల్ల కన్ను వలన మేలు గలిగె.

అందగత్తెను మనువాడగ, మగనిని
లేమ మెచ్చ లేక లేచి పోయె
కడకు దొరికె మెల్ల కన్ను భార్య, కనఁగ
మెల్ల కన్ను వలన మేలు గలిగె!!

సమస్య 121: నాకు మోదమ్ముఁ గూర్చె సునామి యిపుడు.

కలి పురుషుడను నేను లోకములు కీడు
నొంద సంతసించెద, నాకు విందగునది,
జలము ముంచ జపానును జనము చావ
నాకు మోదమ్ముఁ గూర్చె సునామి యిపుడు.

సమస్య 122: ధనమె లక్ష్య మగును తాపసులకు.

ఎవని చేత నెటుల యీ సృష్టి కార్యము
నడుచు? నతని రూప నామమేమి?
అతనిఁ జేరు మార్గమరయఁగ సత్య శో
ధనమె లక్ష్య మగును తాపసులకు.

సమస్య 123: అర్జునునకు మిత్రుఁ డంగరాజు.

సవ్య సాచి పేరు సార్థకంబెవనికి?

తరణి యనగ నెవరు? ధరణి పైన

అడుగనంగనేమి? అమృతాశువెవ్వండు?

అర్జునునకు, మిత్రుఁ, డంగ, రాజు!!

సమస్య 124: నెలవంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ.

ఇల లోన పలు మతములు, ము

సలమానుల ధ్వజముపైన చలువల రేడౌ

వెలయగ రంజాను తిథిన

నెలవంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ!!

చలువల రేడు = చంద్రుడు

తెలిపెను పింగళి జాతికి
వెలుగుల జండా, యెదురుగ వేదిక మీదన్
విలసిల్లంగన్, మువ్వ
న్నెల వంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ!!

సమస్య 125: బావా రమ్మని పిల్చె మోహ మెసఁగన్ బాంచాలి రాధాత్మజున్.

"నే వహ్నిన్ రగిలింప పుట్టితి కదా నీకై సుశీలంబుగన్!
లేవా నీవిట? నన్ను చేకొనగ రాలేవా? పృథా పుత్రకా!
బావా! రమ్మని" పిల్చె మోహ మెసఁగన్ బాంచాలి! "రాధాత్మజున్
నే వీక్షించగనొల్ల! నీకు సమమే నీచుండు సూతుండికన్?"

No comments:

Post a Comment