Friday, February 11, 2011

సమస్యా పూరణ శతం - మొదటి భాగము

నేను వివిథ బ్లాగులలో పూరించిన సమస్యలు మొత్తము వందకు చేరుకున్నవి. ఇందులో సింహ భాగము కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగులో పూరించినివి. వాటినన్నిటినీ టపా రూపములో ప్రచురించె ప్రయత్నమే యిది.

సమస్య1: అక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్

చక్కంగనుండు పచ్చడి

గ్రక్కున వాడు పలనాటి కారము వలనన్

మక్కువ మీరగ తెచ్చితి

నక్కారమ్మనుచు, మగఁడు నాలిం బిలిచెన్


ఆ + కారమ్ము + అనుచు = అక్కారమ్ము + అనుచు = అక్కారమ్మనుచు ( త్రిక,ఉకార సంధులు)

సమస్య2: అక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్

పెక్కగు మందుల కంటే

కిక్కెక్కువనిచ్చునాలి క్రీఁగను చూపుల్

నిక్కము సతియే మందుల

కక్కారమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్!!

మందులకు+అక్క+ఆ+రమ్ము+అనుచు = మందులకక్కారమ్మనుచు

{మందులన్నిటికి అక్క అయిన ఆ రమ్ము (ఒక మందు Brand) యే తన భార్య అని తలచి...}

సమస్య3: శ్రీ రఘు రాము డొక్కరుడె చేకొనె స్త్రీలననేక మందినే!!

ఉత్పల మాల:

తారక రామ భూవరుడు ధర్మము తప్పక నిల్చినంతటన్

చేరెను కీర్తి కాంత మరి చేరెను క్రమ్మఱ రాజ్యకాంతయున్

చేరెను గెల్పు చేడియను చేరెను జానకి ప్రేమ మీరగన్

శ్రీ రఘు రాము డొక్కరుడె చేకొనె స్త్రీలననేక మందినే!!

సమస్య4: హరుడు నియంతయౌ,హరిని యంతము సేయుట పాడియే కదా!!

శిశుపాల రుక్ములతో జరాసంధుడు పలికిన పలుకులు:

చంపక మాల:

వరునిగ చేది భూవరుని వాసిగ నెన్నిక జేసి యుండగా

పిరికితనంబు జూపి తను పిల్లను దొంగిలి వెళ్లె గొల్లడున్

గరికకు తూగునే ఖలుడు? కాంచగ కట్టడి లేక రుక్మిణీ

హరుడు నియంతయౌ,హరిని యంతము సేయుట పాడియే కదా!!

సమస్య5: కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్

కందము:

కడు నెయ్యపు వరుడు, సదా

యెడంద శోభిల్లు పేర్మి, యీడుకు జోడౌ,

ముడి పెట్టగనాడపడచు

కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్!!

సమస్య6: మణులు మాటలాడె మనసు కరుగ

(కురుక్షేత్ర సంగ్రామము తరువాత కౌరవ స్త్రీల విలాపం(
ఆట వెలది:
కారుపరులు నీకు వీరు బాంధవులగు
తాల్మి లేక చంప తగునె? అనుచు
ధర్మ రాజు తోడ దాయాదుల నిజ ర-
మణులు మాటలాడె మనసు కరుగ

సమస్య7: మణులు మాటలాడె మనసు కరుగ

(నేడు నిత్య అవసరాల ధరలు పెరగటము గురించి(
ఆట వెలది:
బీద సాదలకును బియ్యము, కూరలు,
వెచ్చములు కొనంగ వెతలనుచును
నాయకాళి తోడ నయముగను రమణీ
మణులు మాటలాడె మనసు కరుగ

సమస్య8: మాఘ మందున స్నానమ్ము మరణ మొసఁగు.

జావ కారిపోయె జవము జ్వరము వచ్చి,
జలుబు, మధుమేహమును, దగ్గు, చాతి నొప్పి,
రక్త పోటు రోగికి నిజ భక్తి మీర
మాఘ మందున స్నానమ్ము మరణ మొసఁగు.

సమస్య9: పరమ శివునితో లక్ష్మియు పవ్వళించె

తేట గీతి:

కొండ పైన కాత్యాయిని కోరియుండె

పరమ శివునితో, లక్ష్మియు పవ్వళించె

విష్ణుతో నడి సంద్రాన విభ్రమముగ

ఇల్లు వాకిలి లేనట్టి యింతులయ్యె!!

సమస్య10: పచ్చనైన చెట్టు పద్యమయ్యె!

తాటి పత్రమందె మేటి కృతులు పుట్టె
కాగితమ్ము లేని కాలమందు
కవి వరుడు రసమయ కావ్యము వ్రాయగ
పచ్చనైన చెట్టు పద్యమయ్యె!

సమస్య11: కన్నీటికి విలువ ఏది కలికాలంలో!

ఎన్నికల వేళ ఓటుకు
మన్నిక హెచ్చి,అరుదెంచె మన నేతలికన్
సన్నని బ్రతుకుల కడకున్
కన్నీటికి విలువ ఏది కలికాలంలో!

సమస్య12: జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే!!

జలమే ప్రాణము నిల్పు జీవ తతికిన్ స్నానంబు పానంబునై

జలమే వంటకు, పాడిపంటకు, ప్రజా సంసార సామాగ్రికిన్

విలయంబై కరకట్ట దాటి పరుగుల్ వెట్టంగ పృద్వీస్థలిన్

జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే !

సమస్య13: ఒక్కని చావు తెచ్చెను మరొక్కని కందల మెక్కు భాగ్యమున్!

లక్కులు పెక్కు భంగులు విలక్షణ విస్మయముల్ విశేషముల్

తక్కువదేమి కాదితడు దక్షుడు, శిక్షిత సైనికుండు- ఏ

లెక్కననైన చిక్కులను లెస్సగ తీర్చును, చూడ వింతయౌ

ఒక్కని చావు తెచ్చెను మరొక్కని కందల మెక్కు భాగ్యమున్ !

సమస్య14: పొగ త్రాగుమటంచు లోక పూజ్యుండయ్యెన్

జగముల బ్రోవ సురలడిగె

పొగ త్రాగుమటంచు, లోక పూజ్యుండయ్యెన్

నగరాజసుతపతి శివుడు

పొగకును మూలమగు విషముఁబూని ముదమునన్!!

(వివరణ: క్షీర సాగర మథనములో ఏదో భయంకరమైన పొగ లోకాలను కమ్మి వేసినప్పుడు, ఆ పొగకు కారణమేమిటో తెలియక దేవతలు శివున్ని ప్రార్థించగా, ఆ పొగకు కారణము విషమని తెలిసిన శివుడు దానిని ధరించి లోక పూజ్యుడు అయ్యాడు.)

సమస్య15: పొగ త్రాగుమటంచు లోక పూజ్యుండయ్యెన్

రగలని కట్టెలనేమి క
లుగు? మందులిడి యెటులన్ బలుకు వెజ్జెటులన్
నిగమ విదితుడగు వరుసన్?
పొగ, త్రాగుమటంచు, లోక పూజ్యుండయ్యెన్!!

సమస్య16: చదువులు చెప్పించు కొలది చవటాయెనురా!!

ముదముగ పలికెను తెలుగున
పదములు సొగసుగ చదువుల ప్రారంభమునన్,
చదివిన పిమ్మట పలకడు
చదువులు చెప్పించు కొలది చవటాయెనురా!!

సమస్య17: శివుఁడు గరుడు నెక్కి సీమ కేగె!!

శివుఁడనెడి తెరువరి సీమకేగఁదలచె
వెంకటాద్రి రైలు వెళ్లి పోవ
కాన వచ్చెనంత గరుడనెడొక బస్సు
శివుఁడు గరుడు నెక్కి సీమ కేగె!!

(వివరణ: శివుడు అనే పేరు గల ఒక ప్రయాణికుడు సీమకు వెళ్లాలనుకొని వస్తే వెంకటాద్రి ట్రైను మిస్సయ్యింది. దానితో RTC వారి గరుడ బస్సు ఎక్కి సీమకు వెళ్లాడు.)

సమస్య18: పుస్తకంబదేల హస్తమందు?

.వె.
మిద్దెనెక్కెనొకడు విద్దెల నెపమున
చిత్తమదియుఁజూచు చెలువ సొగసు
మస్తకంబునకును విస్తరించగలేని
పుస్తకంబదేల హస్తమందు?
(వివరణ: ఒకడు చదువు నెపముతో మేడ పైకి వెళ్లి ఎదిరింటి అమ్మాయికి "సైటు" కొడుతున్నాడు, అటువంటి వాడికి తలకెక్కని పుస్తకము చేతులో దేనికి?)

సమస్య19: అరిషడ్వర్గములతోడ అందెను ముక్తిన్

కరికి మకరి పీడ కలిగె

అరిషడ్వర్గములతోడ, అందెను ముక్తిన్

పరమాత్ముని వేడుకొనిన,

వరదాయిని నమ్మిన మరి వగపు కలుగునే!!


సమస్య20: శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్!!

తనరు త్రిపురములఁగూల్చగ
అనికి చనెడి హరునకు హరి అమరెను తూపై
వనజాక్షుఁడు శ్రీధరుఁడీ
శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్!!

ఈశునకు + అమ్ము + ఐనట్టీ = ఈశునకమ్మైనట్టి

(వివరణ: త్రిపురాసురల పైకి శివుడు యుద్ధానికి వెళ్తుంటే, హరి శివునికి బాణము గా మారెను. అటువంటి ఈశ్వరుని యొక్క బాణమైన హరి మనకు శుభములు ఇచ్చుగాక)

సమస్య21: శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్!!

జనులను ఘనులను మునులను
తన బలమున హింసఁజేయు దశకంఠునకున్
జనకసుత హరునకసురే
శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్!!

అకము = దుఃఖము
అసుర +ఈశున్ +అకమ్ము +ఐనట్టి = అసురేశునకమ్మైనట్టి =రాక్షస రాజు దుఃఖమునకు కారణమైన

(వివరణ: సీతను హరించి, సాధువులను హింసించే రావణుడు అనే రాక్షస రాజు యొక్క దుఃఖమునకు కారణమైన హరి మనకు శుభములు ఇచ్చుగాక)

సమస్య22: రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్!!

కాముడి కోరిక పుట్టగ
ప్రేమగ రఘురాము సీత రీతిగ మారెన్
కామము తీరిన పిమ్మట
రాముడు రాక్షసుడు, సీత రక్కసి యయ్యెన్!!

సమస్య23: బస్సు నీటఁ దేలె పడవ వోలె!!

కట్టె త్రిభుజమొకటి, కాగిత రాంబస్సు
నొకటి నీట విడువ నుల్లసమున,
మునిగె త్రిభుజము, మరి ముదముగఁజూడ రాం
బస్సు నీటఁ దేలె పడవ వోలె!!

రాంబస్సు = సమ చతుర్భుజము

సమస్య24: మేడపైనుండి పడినను మేలు కలిగె

తే.గీ.

పూచె మేడపై నొక జాజి పూల తీగ

మెట్ల నెక్కఁజాలక వృద్ధ మిన్నకుండె

గాలి వానకు రాలెను పూలు కొన్ని

మేడపైనుండి పడినను మేలు కలిగె!!

సమస్య25: సుకవు లెంద రున్నను మేలు కుకవి యొకఁడు

సరస సాహితీ సభలోన మురిపముగను
సుకవు లెంద రున్నను మేలు, కుకవి యొకఁడు
చేరిన రసభంగమగును చేటుఁగలుగు
పాల కుండలో లవణము పడిన రీతి!!

No comments:

Post a Comment