సమస్య51: రంగవల్లి యుద్ధరంగ మయ్యె.
"అసుర సేనకెదుట నమర సేనయునమ
రంగ, వల్లి! యుద్ధరంగ మయ్యె,
తారకాసురవధ తడవయ్యెను చెలియా!"
అనెను కార్తికేయుడాలితోడ!!
సమస్య52: సంసారిగ నున్న వాఁడె సన్యాసి యగున్
సంసారమందు సతి గృహ
హింస యనుచును బెదిరించి యిడుముల త్రోయన్
కంసారి యైనను సగటు
సంసారిగ నున్న, వాఁడె సన్యాసి యగున్!!
సమస్య53: సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్పె
ఘల్లు ఘల్లుమనుచు మ్రోయ సెల్లు ఫోను
తప్పుకు తిరగగ కుదరదెప్పుడైన
ఎవనికైన మరి దొరుకు నవని పైన
స్విచ్చునాపి లేదని పల్కు సిగ్నలచట
కడకు హరి చంద్రుడైనను కల్లలాడు
సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్పె!!
సమస్య54: నానాటికి తీసికట్టు నాగంభొట్లూ!
(నాగంభొట్లు భార్య తన భర్త పేదరికాన్ని ఎద్దేవ చెస్తూ పలికిన మాటలు)
కానగ గతి మీకింకన్
మా నానిచ్చిన నవీన మధుపర్కంబుల్
మానము కాచు సభలలో
నా నాటికి తీసికట్టు నాగంభొట్లూ!
(సభలలోన్ + ఆ నాటికి = సభలలోనానాటికి)
సమస్య55: వేళ కాని వేళఁ బిలువఁ దగునె
సరస భావమొంది చక్రి లక్ష్మినిఁగూడ
పాహి పాహి యనుచు పలికె హస్తి
కొంగుఁబట్టి కదిలె, భంగమయ్యె ముదము
వేళ కాని వేళఁ బిలువఁ దగునె?
సమస్య56: పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్
సందుల గొందుల యందున
మందుకు బానిసగ మారి మత్తుగ దొర్లెన్
పందిని పడతిగ తలఁచెను
పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్!!
సమస్య57: కలువ వికసించె సూర్యుని కరము సోకి
తే. బద్దకస్తుడొక్కండును మిద్దెనెక్కి
నిద్ర పోయె, లేచుటకై ప్రభాత వేళ,
మొద్దు నిద్ర వీడక పెట్టె ముసుగు, కంటి
కలువ వికసించె సూర్యుని కరము సోకి!
సమస్య58: హనుమా! లక్ష్మిని పెండ్లియాడుమని యభ్యర్దించే నబ్ధీశుడున్
మ. ఘనమో క్షీర సముద్రమున్ జిలుకు లగ్నంబందు శ్రీదేవి తా
జనియించెన్ జలరాశి యింట, హరి విశ్వాత్ముండు విష్ణుండు యీ
వనితన్ చేకొన తగ్గవాడనుచు, దివ్యన్, సింధుజన్, ఘూక వా
హను, మా లక్ష్మిని పెండ్లి యాడుమని యభ్యర్థించె నబ్థీశుడున్!
వివరణ: ఘూకం = గుడ్ల గూబ
ఘూక వాహన = గుడ్ల గూబను వాహనం గా కలిగినది = లక్ష్మీ దేవి
సమస్య58: మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్
కం. వేసము వేసిన కలుగును
మీసములు పడతికిఁ జూడ, మిధ్యగ మారున్
వేసము తొలగింపంగన్
మీసాలే స్త్రీకి సొబగు ? మీరేమన్నన్!
వివరణ: మీసాలు + ఏ స్త్రీకి సొబగు ? = మీసాలే స్త్రీకి సొబగు ? ( మీసాలు ఏ స్త్రీకి సొబగు కాదు అని భావం)
సమస్య59: వాన దేవుడు కరుణించి వార్థి జొచ్చె
తే. సోమకాసురుడు శృతులు చోరి చేసి
సాగరంబున దాగెను వేగ రీతి
కుపిత చేపయ్యె విష్ణువు, కురిసె పూల
వాన, దేవుడు కరుణించి వార్థి జొచ్చె!
సమస్య60: కుంజర యూధమ్ము దోమకుత్తుక జొచ్చెన్
కం. రంజుగ పిల్లల కేళి స
రంజామాలోన మిగుల రాకసి దోమల్
కుంజర చిరు ప్రతిముండిన
కుంజర యూధమ్ము దోమకుత్తుక జొచ్చెన్!!
సమస్య61: రావణు జేరె సీత యను రాగము లొల్కెడు పల్కు లాడుచున్
ఉ. పావన మూర్తి రామునికి భార్యగ మారగ మాయ తోడుగన్
రావణ చెల్లి సూర్పనఖ రాక్షస కామిని మారె సీతగా
రావణు మార్చె రూపు వర రాముని వోలె ధరాత్మ జాతకై
రావణు జేరె సీత యను రాగము లొల్కెడు పల్కు లాడుచున్!!
ప్రాణ జ్యోతిగ దైవము
లోన వెలిగి, ఆవరించె లోకములెల్లన్
కానంగ లేడనెడి అను
మానమ్మే లేనివాఁడు మాన్యుండయ్యెన్!!
సమస్య63: రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో
సాయముఁజేసె దీపకుఁడు ఛాత్రవరుండెటు కుష్ఠు రోగికిన్?
మ్రోయగ చాపమున్ విఱిచి మోహన రాఘవుఁడేమిఁజేసెనో?
మాయల మంథరెవ్వరు? సుమాలను కోసెడివారలెవ్వరున్?
రోయకఁ, బెండ్లియాడెను, కురూపిని, చక్కని చుక్క ప్రేమతో!!
సమస్య64: తమ్మునికి నన్న వరుసకుఁ దమ్ముఁ డయ్యె.
అక్క చెల్లెల్ల సుతులు తోడల్లురయ్యె
తమ్మి చేకొనె అక్కను ధర్మ సతిగ
అన్న చేకొనె చెల్లిని ఆలిగ మరి
తమ్మునికి నన్న వరుసకుఁ దమ్ముఁ డయ్యె.
సమస్య65: సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!
మురిపముగ ముద్దు పెట్టగ
పరిణయమాడిన తన సతి ప్రణయము తోడన్
సరసము తెలియక విసిరి క-
సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!
సమస్య66: పాల వలన జనులు పతితులైరి.
వహ్ని తరిగె మౌని పత్నుల మోహించి
గాడి తప్పె మౌని గాధి సుతుడు
తార పతన మొందె, తగని శృంగార తా
పాల వలన జనులు పతితులైరి.
==================================================================
సమస్య67: కష్టములు దీరఁ గన్నీరుఁ గార్చినారు.
పచ్చగున్న పరులఁ జూచి మెచ్చ లేక
పీత బుద్ది తో కుజనులు పీకులాడు,
దైవ ఘటన చేత పరులు ధనమునొంది
కష్టములు దీరఁ గన్నీరుఁ గార్చినారు.
సమస్య68: సూర్యబింబ మమరె సుదతి నుదుట
దుర్గా దేవి అవతరణ;
సురలు వేడుకొనగ పరవసించెను తల్లి
అవతరించె నంత ఆది శక్తి
విశ్వ తేజమమరె వెలది మోము పగిది
చంద్ర వహ్నులమరె చక్షువులుగ
చాన భృకుటిగయ్యె శార్ఙ్గ పినాకాలు
కాళ రాత్రి కంటి కాటుకయ్యె
స్థిరముగ వెలుగు సిరి తిలకము రీతిగ
సూర్యబింబ మమరె సుదతి నుదుట
దురిత దూర అమ్మ దుర్గమ్మ మాయమ్మ
కరుణఁ జూపి మమ్ము కాచునెపుడు!!
సమస్య 69: అమృత పానమ్ము మరణమ్ము నందఁ జేసె
విష్ణు భక్తి తోడ సురలు వినుతి కెక్కి
క్షీర సాగర మథనాన జేసె వారు
అమృతపానమ్ము, మరణమ్ము నందఁ జేసె
దనుజులకు హరి ద్వేషము తరచి చూడ!!
అనవరతము నీ మాటలు
విని నీ పథమనుసరించి విధ్యను వీడన్
జనమున చులకనయగు భా-
వి నాయకా! నిన్నుఁ గొలువ విఘ్నము లెసఁగెన్
సమస్య 71:చీమ తుమ్మెను బెదరెను సింహగణము.
ఏది హీనాంగి? జలుబున యేమిఁజేసె?
ఏమిఁజేసె పిల్లులు కుక్క యెదురు రాగ?
బాల కృష్ణ చిత్రంబేమి చాల హిట్టు?
గురు లఘువులేమగు వరుస కూడినంత?
చీమ, తుమ్మెను, బెదరెను, సింహ,గణము.
సమస్య 72: స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె.
బాల నాగమ్మ అందాల భామ కాగ
మాయల పకీరు కుక్కగా మార్చెనంత
మాయల పకీరు మరణించె మాయ తొలగె
స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె.
సమస్య 73: బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!
బట్ట తల వచ్చె వరునకు వయసు మీరె
పిలిచి పిల్లనివ్వరు నేడు కలిమి లేక
బ్రహ్మచారికి, ఎనమండ్రు భార్య లౌర
ఎట్టు సాధ్యమౌ? శ్రీ కృష్ణ! గుట్టుఁజెప్పు!
సమస్య 74: బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!
బ్రహ్మ విద్యలను పఠించి, పరమ పదము
బ్రహ్మమని తలచిన వాడు బ్రహ్మచారి.
అరయ యదువంశ భూషణుడట్టివాడు
బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!
కనుమ అనగనేమి? ఇనుడెప్పుడుండును?
క్రొత్త పాతలందు గొప్ప యేది?
ఆలికి సఖుడెవ్వడందరిలోఁజూడ?
పండుగ, దినమందు, పాత, మగఁడె!
No comments:
Post a Comment