Monday, February 14, 2011

సమస్యా పూరణ శతం - చివరి భాగము

సమస్య 76: భామకు చీరేలనయ్య పదుగురు చూడన్!

హేమంతపు మంచు కురిసి
ధూమము గగనమ్ముఁగప్పె తూరుపు దిక్కున్
ద్యౌమణి కనలేము, పగటి
భామకు చీరేలనయ్య పదుగురు చూడన్.

సమస్య 77: కొంగ కైదు కాళ్ళు కోడికి వలె.!

రెక్కలుండు రెండు, ముక్కొక్కటి కలదు
అరయ దొంగ బుద్ది, ఆయువులవి
కొంగ కైదు, కాళ్ళు కోడికి వలె రెండు,
తాపసి వలెనుండు, చేప బువ్వ!!

సమస్య 78: కస్తురి తిలకమ్ము గరళ మయ్యె.

హరినిఁ జూడ పసిడి హారముల్ వస్త్రముల్
కస్తురి తిలకమ్ము, గరళ మయ్యె
బువ్వ భూతపతికి పురహరునకుఁజూడ
డాంబికమ్ము లేక డంగవుదురు!!

సమస్య 79: అన్నా యని రాముఁ బిలిచె నవనిజ భక్తిన్.

(సీతాపహరణము తరువాత శ్రీ రాముడు సీతకై వెదుకుతూ, ఒక చెట్టు కొమ్మను సీత జాడను అడుగుతున్న సందర్భములో)
అవనిజము = చెట్టు (భూమి నుండి జనించినది)

కన్నావే అవనిజమా!
వెన్నెల మోము వెలదినని విటపమునడుగన్,
అన్నా! మా నీడకు రా
రన్నా! యని రాముఁబిలిచె నవనిజ భక్తిన్!!

సమస్య 80: రవి కెందుకు నీకు తరుణి రాతిరి వేళన్.

సవనంబే సంసారము
ధవుడే నీ దరికిఁజేర తాపమున, తనూ
భవునకు పాలిచ్చునపుడు
రవి కెందుకు నీకు తరుణి రాతిరి వేళన్.

సమస్య 81: సాఫ్టువేరు మగని జాడఁ గనరె!

బగ్గు వెతుకు కాని - బుగ్గను కొఱకడు
కోడు వ్రాయుఁ గాని - కూడ రాడు
మౌజు పట్టుఁ గాని - మోజుఁ జూపగ రాడు
సాఫ్టువేరు మగని జాడఁ గనరె!

సమస్య 82: ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో.

సత్పదమొంద చక్కగను ఛందము నేర్చిన వాడె మేటియౌ

ఉత్పల మాలలో పదికినొప్పుఁ గదా యతి వాని విద్యలో,

తత్పద విద్య లేక కవితా రసమందున వాని నేర్పులో

ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో.

సమస్య 83: మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్.

సత్తువఁ గలిగిన సూమో,

చిత్తగు నెవరైన, వాడు చేవకు గజమే,

బిత్తర పాటునఁ జూచితి

మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్.

సమస్య 84: తల లైదు కరంబు లారు తను వది యొకటే!

ఖలుడతడు రావణుడు పది

తలలను యిరువది కరములు దాల్చె రణమునన్

కలహము నడుమ మిగిలెనిక

తల లైదు కరంబు లారు తను వది యొకటే!

సమస్య 85: గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్.

పాడెకు ప్రాణము వచ్చును

గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్

త్రాడే పాముగ మారును

ఆడేటి అబద్ధములకు హద్దులు గలవే!!

సమస్య 86: కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!

వడివడిగనూడెఁ కురులవి

కొడుకునకు విడువక తండ్రి క్రోమోజోముల్,

విడిచె సుత వంశ నామము,

కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!

వివరణ: తండ్రికి బట్ట తల ఉంటే కొడుకుకు ఖచ్చితముగా వస్తుంది, కాని కూతురికి రాదు. కాబట్టి జీన్సు వలన కొడుకుకు వేలకు వేలు తల వెట్రుకలు ఊడిపోతే, కూతురికి మాత్రము ఒక్క ఇంటి పేరే మారుతుంది.

సమస్య 87: చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్.

నడుమునకు గోచి ఆడగ

చెడుగుడు, నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్,

కుడవగ కంచము, గొడుగే

తడవకనుండగ జనులకు తప్పక వలయున్!!

సమస్య 88: దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా?

వద్దను వారలు కలరే

ఒద్దికగ శ్రమపడి వృద్ధి నొందిన జగతిన్

బద్దకము వీడగ వలయు

దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా?

సమస్య 89: దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా?

సుద్దులు వినకయె ఊరక

ప్రొద్దును పుచ్చుచు మనెదరు పోరంబోకుల్

దిద్దగ నేర్వరు నడతల్

దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా?

సమస్య 90: బారులు లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్.

బారులు బారులై జనులు బాగని మెచ్చగ కావ్య రాజమున్
ధారణఁ జేసి శ్రోతలు సుధారస వాహిణి వోలె పోల్చినన్
చేరును కీర్తి కాంతలిక చెచ్చెర, మారెను నాటి కాలముల్
బారులు లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్.

సమస్య 91: తలలు వంచి గగనతలముఁ గనుఁడు.

ధర్మరాజు భీముని తో పలుకుట: (బాల భారత నేపద్యము లో)

వ్రతముఁ జేయఁ దలచె పాండవ మాత,
ధీర! భీమ! వలయు దేవ గజము,
వజ్రి యివ్వబోడు, బలము తోడ సురల
తలలు వంచి గగనతలముఁ గనుఁడు.

సమస్య 92: విద్య నేర్చినవాఁడె పో వింతపశువు.

కలహమిరు సీమల నడుమ కలిగి నంత
గురుఁడు పరుఁడని తెలియక కోపగించి
గురుఁడు పరుఁడనుచుఁ దలచి తరిమి వేసె
విద్య నేర్చినవాఁడె పో వింతపశువు!!

పరుఁడు (1)= పరమాత్మ, దైవము
పరుఁడు (2)= శత్రువు, అన్యుడు

సమస్య 93: భార్యకుఁ బ్రణమిల్లె భక్తిభావము గదురన్.

సూర్య కులాన మొలచి ఆ

శ్చర్యముగ వివాహమాడె క్ష్మాసుత సీతన్!

భార్యయె అత్తగ మారగ

భార్యకుఁ బ్రణమిల్లె భక్తిభావము గదురన్!!

(వివరణ: విష్ణువుకు భార్య అయిన భూదేవియే, రామావతారములో అత్తగా మారినది)

సమస్య 94: వేదముఁ జదివిన పురుషుఁడు వెధవగ మారున్.

వేదాదరము తరిగెనిక

భూదేవునకును తినుటకు బువ్వే కఱువై

వీధిన పడిరిక విప్రుల్

వేదముఁ జదివిన పురుషుఁడు వెధవగ మారున్.

సమస్య 95: ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్.

అరి వీర భయంకరుఁడగు

మురిపపు సతి పాక సుతుఁడు మును ముందనుచున్,

తరచి తరచి విశ్రవసుఁడు

ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్.

(రావణ, కుంభకర్ణ, విభీషణులు విశ్రవసు, కైకసి కుమారులు కాగా, విశ్రవసు యొక్క రెండవ భార్యయగు పాకకు జన్మిచిన వాడు ఖరుడు)

సమస్య 96: రతికై సోదరిని వేగ రమ్మని పిలిచెన్..

రతి అగ్నిహోత్రి నాయిక
అతులిత సౌందర్య రాశి, అభిమానంబే
మితిమీర చిత్రముఁ గనగ
రతికై, సోదరిని వేగ రమ్మని పిలిచెన్.

సమస్య 97: దున్న హరినిఁ జూచి సన్నుతించె.

చేరి మృగములన్ని సింహమును నిలిపె
వనికి రాజుగ, మరి వాని మంత్రి
దున్న పోతు, ముదము మిన్నంటగ సభలో
దున్న హరినిఁ జూచి సన్నుతించె.

హరి = సింహము

సమస్య 98: చేయవలయు గురువు శిష్యపూజ.

నంద సుతుఁడె గురువు నారద మౌనికి,
వ్యాస తాప హారి, భక్తి సూత్ర
దాత, ధాత సుతుడు, దైవర్షి యగుటచే
చేయవలయు గురువు శిష్యపూజ.

సమస్య 99: భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె.

భక్తి భావమ్ము మెండగు భర్త యొకఁడు,
భార్య కవయిత్రి, వ్రాసెను పద్యమొకటి,
తేట గీతి పాదములను తెచ్చి జూపె
భార్య, పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె!!

సమస్య 100: పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రు లందఱున్.

శ్రీకృష్ణ రాయబారము:

గతమును వీడి పాండవులు, కౌరవ! పంపిరి నన్ను సంధియే
హితమని బంధుమిత్రులకు, నీనృప లోకము మేలు పొంద నీ
సుతులను నిన్ను కోరిరి యశోధన! భూవర! యంచు పల్కి భూ

పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రు లందఱున్.

4 comments:

  1. సత్యనారాయణ గారూ,
    వంద సమస్యాపూరణలు పూర్తయిన సందర్భంగా అభినందనలు. ధర్మదండంలో మీపూరణ చాలా బాగుంది.

    ReplyDelete
  2. శతాధిక సమస్యాపూరణ దురంధరులు జిగురు సత్యనారాయణగారికి హృదయపూర్వక అభినందనలు!

    ReplyDelete
  3. మీ పూరణల నన్నింటినీ ఇలా గుదిగుచ్చి ఒకచోట ప్రదర్శించడం బాగుంది. దీనిని పి.డి.ఎఫ్. లో ఇబుక్ గా చేస్తే బాగుంటుందని నా సలహా. శుభమస్తు!

    ReplyDelete
  4. ఫణి ప్రసన్న కుమార్ గారు, మురళీ మోహన్ గారు,
    మీ అభినందనలకు ధన్యవాదములు.
    శంకరయ్య గారు,
    తప్పకుండా మీ సలహాను పాటిస్తాను.

    ReplyDelete