Saturday, February 12, 2011

సమస్యా పూరణ శతం - రెండవ భాగము

సమస్య26: రాముని జంపి రావణుఁడు రాజ్యమనేలె సుఖింపనెల్లరున్

ఉత్పల మాల:

పాముల వోలె ద్వేషమును బాయని హైందవ శత్రు సంఘముల్

పామర బుద్ధి విజ్ఞతలు పాచిన నాస్తిక హేతు వాదముల్

బూమెలుఁజూప మూర్ఖముగ భూరిగ తీసిన చిత్రమందునన్

రాముని జంపి రావణుఁడు రాజ్యమనేలె సుఖింపనెల్లరున్!!

సమస్య27: కోకిలమ్మకుఁ బుట్టెను కాకి యొకటి

తే.గీ.
తెరను మెప్పించిన నటులు తరలి పోయె
వంశ ఘనతను వాగెడి వారసుండు
వచ్చె, టాలెంటు లేనట్టి వానిఁజూడ
కోకిలమ్మకుఁ బుట్టెను కాకి యొకటి!!

సమస్య28: నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను

.వె.
అంతరంగిక సభనందుండ పాండవుల్
ద్రుపద పుత్రి చనువు తోడ వచ్చి
పలికె నిటుల తాను "పిలిచె రమ్మని కుంతి
నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను" !!

సమస్య29: సారా త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్

శ్రీరామ నవమి నాడొక

సారా బానిస నిషాన సారా యడుగన్

మారుగ పానకమిడి, యిది

సారా త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్!!

సమస్య30: వాడిన పువ్వులే తగును వారిజనేత్రుని నిత్యపూజకున్

వేడుకఁగల్గగా జడకు వీలుగ పెట్టగ దైవ పూజకున్

వాడిన పువ్వులే తగును; వారిజనేత్రుని నిత్యపూజకున్

వీడని భక్తి భావమున ప్రీతిగ కోయుము పుష్ఫ గుచ్ఛముల్

చేడియలార! రండిపుడు శ్రీహరి బ్రోచును మిమ్మునెల్లరున్!!

సమస్య31: రతము ముగియకుండ రమణి లేచె

రథము ముగ్గు వేయ రమణి యొకతి వచ్చె

ఫోను రాగ నడుమ లోనికేగె

'' పలకంగ లేని తరుణి పలికెనంత

"రతము ముగియకుండ రమణి లేచె"!!

సమస్య32: గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్

తండ్రీ కృష్ణా! నిన్నును
గుండ్రాతికిఁగట్ట మాత కోపము తోడన్
గండ్రించితివట తరువుల్
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్!!

సమస్య33: కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్

కంతలు దాచిన దాగునె?
రంతుగ మారెనట హృదయ రంజిత తోడన్
వింతగ నిత్యానందుడు
కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్!!
=======================================

సమస్య34: కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్

స్వాంతనమున లోకముఫై
బ్రాంతులుఁబాసి మది నిలిపె పరదైవముపై
అంత నియమమున దీక్షా
కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్!!

సమస్య35: కలలు గనెడి శిలలు పలుక గలవు

తలలు లేని నరులు కలలను గనెదరు
కలలు గనెడి శిలలు పలుక గలవు
పలుక లేని వాడు పాడఁగలడు, చూడ
వినెడి వాడు పెద్ద వెఱ్ఱి వాడు!!

సమస్య36: కోడిని కరకర నమిలె కోడలమ్మ!

క్రొత్త కోడళు వచ్చిన అత్తఁజేసె

వేడి వేడి పకోడీలు వింటరందు

పడక గది వీడి బయటకు వచ్చి, ఆ ప

కోడిని కరకర నమిలె కోడలమ్మ!

వింటర్ (Winter) + అందు = వింటరందు

సమస్య37: అత్తకు కన్ను గీటె నల యల్లుఁడు తాపముఁ దీర్పఁ గోరుచున్

చిత్తరువొక్కటిన్ కనగ చిత్తము కాముని కోర్కు విత్తినన్

తత్తరపాటు లేక కడు తాపము తీరగ మామ కాముడై

అత్తకు కన్ను గీటె, నల యల్లుఁడు తాపముఁ దీర్పఁ గోరుచున్

హత్తుకు పోయెనంత తన ఆలిని సుందర నీల వేణినిన్!!

సమస్య38: ఇంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు

రామ నామమందు రమణీ రమించెద
రామ రామ రామ రామ యనుచు
రామ చంద్రునకును రఘుకుల శ్రేష్ఠ రా
జేంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు!!

సమస్య39: మందు లనారోగ్య మొసఁగు మద్యమె మేలౌ

బ్రాందీ విస్కీ మొదలగు
మందు లనారోగ్య మొసఁగు, మద్యమె మేలౌ
గాంధీ మార్గము విడిచిన
కొందరి పాలకులకు తమ కోశము నింపన్!!

సమస్య40: రౌడీలే పాలకు లగు రాజ్య మిదయ్యెన్

వాడిగ తొడలను గొట్టెడి
లీడరు, తలలు నరుకుమను లీడరు, చూడన్
దాడులు చెయ్యగ పలికెడి
రౌడీలే పాలకు లగు రాజ్య మిదయ్యెన్!!

సమస్య41: నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్.

జనులకు తానే దిక్కని
తను జేసెడి కార్యములను త్యాగమ్మనుచున్
ఘనముగ మన యిటలీ లల
నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్.

42: పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్

ముచ్చుల పాలనలో మరి

హెచ్చిన ధరలను కనంగ యెదపోటయ్యెన్

నచ్చిన నచ్చక పోయిన

పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్!!

సమస్య43: గొడుగు కలిగి కూడ తడిసినాఁడు

"నీవు వచ్చెదనన నేను వద్దనెదనా?"

అనుచు వాన తడిసె అతివ యొకతి

ఆమె తోడ కూడి యాడె నొకడునంత

గొడుగు కలిగి కూడ తడిసినాఁడు!!

సమస్య44: భగణంబున గురువు నాస్తి పండితులారా

తగునట కేంద్రము కోణము
మిగుల శుభగ్రహములున్న మేలగు రీతిన్
సుగమము కాదిక నట్టి శు
భ గణంబున గురువు నాస్తి పండితులారా!"

సమస్య45: బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు

చంక నాకి పోయె శాస్త్ర సారమ్ములు

రంకు బొంకు నేడు రహిఁగలిగెను

వంక బెట్ట లేరు వసుధన వీరిని

బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు!!

సమస్య46: ఓటమి గెలుపే యగునిక ఓడును గెలుపే

ఓటుకు ఈవీయమ్మై

ఓటమి గెలుపే యగునిక, ఓడును గెలుపే

ఫేటును మార్చెడి యంత్రము

ఘాటుగ వలదని పలికిరి ఘన నేతలికన్!!

ఈవీయమ్ము = EVM (Electronic Voting Machine)

సమస్య47: కుంటివాఁడెక్కె తిరుమల కొండ పైకి

కంటఁజూడ దైవమ్మును కలియుగమున

ఒంటిగ వెడల లేనట్టి కుంటి వాఁడు

వెంట రాగ బంధు జనము వేడ్కఁగల్గ

కుంటివాఁడెక్కె తిరుమల కొండ పైకి!!

సమస్య48: ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను

వార్తఁ జెప్ప కుండ వ్యాఖ్యలు జేయుచు

విలువులకు నిలువుగ శిలువ వేయ

జనులు మీడియాను చడమడ తిట్టగ

ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను!!

సమస్య49: కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము

దాచి పెట్టిన సొమ్మును దోచుకొనఁగ

వత్తురో దొంగలని, వాడు పగలు రాత్రి

నిదుర మాని కాపుగనుండి నీరసించె

కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము!!

సమస్య50: పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను

చిత్రమైన చలన చిత్రమష్టాచెమ్మ

ఇష్ట సఖిని పొంద కష్టమైన

పేరు మార్చు కొనెను ప్రేమ తోడ, మహేషు

పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను!!

No comments:

Post a Comment